ఎనిమిది నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లోనూ బొమ్మ పడలేదు. కొత్త సినిమాల రిలీజ్ ఊసే వినిపించడం లేదు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ధైర్యం చేశాడు. తన కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. డిసెంబరు 25న రిలీజ్ అంటూ పోస్టర్ కూడా వదిలాడు. సంక్రాంతికి ఆల్రెడీ నాలుగైదు సినిమాలు రేసులో ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు ప్రకటన చేశారు. కానీ వాళ్లందరిదీ ఒకటే ఆలోచన. థియేటర్లు ఆ సమయానికి పూర్తి స్థాయిలో నడిస్తే రిలీజ్ చేద్దాం అనుకుని, కర్చీఫ్ వేసి పెట్టారంతే. థియేటర్లు అలా నడవని పక్షంలో ఆ సినిమాల్లో ఏదీ రాకపోయినా ఆశ్చర్యం లేదేమో.
ఐతే తేజు సినిమా సంగతి వేరు. క్రిస్మస్‌కు థియేటర్లు 100 శాతం కెపాసిటీతో నడుస్తాయన్న సంకేతాలు ఎంతమాత్రం లేదు. ఈ మధ్యనే థియేటర్లు పునఃప్రారంభం అయ్యాయి కానీ చిన్నా చితకా చిత్రాలు కూడా కొత్తవి విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో నాలుగు వారాల్లో తమ సినిమా రిలీజవుతుందని డేట్‌తో సహా పోస్టర్ వదలడమంటే సాహసమే. సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులను కూడా తీసుకున్న జీ5 వేస్తున్న వ్యూహాత్మక అడుగిది.
కొంచెం అటు ఇటుగా థియేటర్లలో, అలాగే డిజిటల్ మీడియంలో సినిమాను రిలీజ్ చేద్దామనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 50 శాతం కెపాసిటీతో అయినా థియేటర్లు ఫుల్ అయితే చాలనుకుంటున్నారు. వాళ్ల ఆలోచన ఏదైనప్పటికీ.. ఈ సినిమాకు జనాల నుంచి స్పందన ఎలా ఉంటుందన్నదానిపై టాలీవుడ్ తదుపరి కార్యాచరణ ఉంటుంది. సంక్రాంతి సినిమాల భవితవ్యం కూడా సోలో బ్రతుకే సో బెటర్ ఎలా ఆడుతుందన్న దాని మీదే ఆధారపడి ఉంది. మరి ఈ చిత్రం అనుకున్నట్లే డిసెంబరు 25న విడుదలవుతుందా.. దాన్ని థియేటర్లకు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తారా అన్నది ఆసక్తికరం.