బుక్ మై షోకు నిర్మాత క్లాస్

త‌న ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన మిత్ర‌మండ‌లి సినిమా మీద సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న నెగెటివ్ క్యాంపైనింగ్ విష‌య‌మై ఇటీవ‌ల నిర్మాత బ‌న్నీ వాసు వ్యాఖ్య‌లు చ‌ర్చనీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి వ్య‌తిరేక ప్ర‌చారాలు చేసినంత మాత్రాన తాను ఆగిపోన‌ని.. ఇలాంటివి త‌న వెంట్రుక‌తో స‌మానం అంటూ ఆయ‌న స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడూ కూల్‌గా క‌నిపించే బ‌న్నీ వాసు ఇంత తీవ్రత‌తో మాట్లాడ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆయ‌నంత ఆగ్ర‌హం తెచ్చుకోవ‌డాడ‌నికి కార‌ణ‌మేంటి.. మిత్ర‌మండ‌లి మీద అలా విషం క‌క్కింది ఎవ‌రూ అంటూ సామాజిక మాధ్య‌మాల్లోనే కాక ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై రిలీజ్ ముంగిట జ‌రిగిన మిత్ర‌మండ‌లి ప్రెస్ మీట్లో బ‌న్నీ వాసు స్పందించాడు.

మిత్ర‌మండ‌లికి వ్య‌తిరేకంగా ఏ మూవీ టీం నెగెటివ్ క్యాంపైనింగ్ చేయించిందో త‌న‌కు తెలియ‌ద‌ని బ‌న్నీ వాసు తెలిపాడు. కానీ ఇలాంటి ప్ర‌చారాలు చేయ‌డానికి ఇండ‌స్ట్రీలో కొన్ని టీమ్స్ త‌యార‌య్యాయ‌ని.. వాళ్లే నిర్మాత‌ల‌ను ప్ర‌భావితం చేసి డ‌బ్బులు తీసుకుని ఇవి చేస్తున్నార‌ని.. మిత్ర‌మండ‌లికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ప్ర‌చారం చూశాక ఇండ‌స్ట్రీలో ప‌లువురితో మాట్లాడితే త‌న‌కీ విష‌యం తెలిసింద‌ని బ‌న్నీ వాసు చెప్పాడు. మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ లాంచ్ అయిన‌పుడు కింద ఒకే లాంటి కామెంట్లు ప‌దుల సంఖ్య‌లో ప‌డ్డాయ‌ని.. త‌న టీం స‌భ్యులు చెబితే వాటిని చూశాన‌ని.. అవి ఎవ‌రో ప‌నిగ‌ట్టుకుని వేసిన కామెంట్స్ అని త‌ర్వాత అర్థ‌మైంద‌ని బ‌న్నీ వాసు తెలిపాడు.

సినిమాల‌కు పాజిటివ్ ప్ర‌చారం చేసి పెట్ట‌డంతో పాటు పోటీలో ఉన్న చిత్రాల మీద నెగెటివ్ క్యాంపైన్ చేసేవాళ్లు ఇండ‌స్ట్రీలో ఉన్నార‌ని తెలుసుకున్నాన‌ని.. అలాంటి ప్ర‌పోజ‌ల్స్‌తో వ‌చ్చే వాళ్లను కొంద‌రు నిర్మాత‌లు తిట్టి పంపిస్తున్నార‌ని.. కొంద‌రు మాత్రం వారి మాయ‌లో ప‌డుతున్నార‌ని వాసు చెప్పాడు.
ఇది కాకుండా బుక్ మై షోలో ప‌నిగ‌ట్టుకుని త‌క్కువ రేటింగ్స్ వేయ‌డం.. సినిమా స్థాయికి మించి రేటింగ్స్ ఇవ్వ‌డం.. ఇలాంటి పెయిడ్ క్యాంపైనింగ్ కూడా జ‌రుగుతోంద‌ని.. సినిమాల మీదే బ‌తుకుతున్న బుక్ మై షో ఇలాంటివి ఎలా ఎంక‌రేజ్ చేస్తుంద‌ని వాసు ప్ర‌శ్నించాడు. ప్రేక్ష‌కులు టికెట్లు కొనే ద‌గ్గ‌రే ఇలాంటి త‌ప్పు జ‌ర‌గ‌డం అన్యాయ‌మ‌ని అత‌న‌న్నాడు. జ‌ర్న‌లిస్టులు రివ్యూలు రాయ‌డం వాళ్ల ప్రొఫెష‌న్ అని.. అలా కాకుండా బుక్ మై షోలో అథెంటికేషన్ లేకుండా ఇలా పెయిడ్ రేటింగ్స్, రివ్యూలు ఇవ్వ‌డం మాత్రం మంచి ప్రాక్టీస్ కాద‌ని .. వాటిని నివారించాల‌ని బుక్ మై షోకు సూచించాడు బ‌న్నీ వాసు.