నిన్న మిత్ర మండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ ఒకింత ఆవేశం, ఆవేదనతో అన్న మాటలో ఇండస్ట్రీ, అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీశాయి. తమ సినిమాని దెబ్బతీసే ఉద్దేశంతో అవతలి వాళ్ళు కావాలని నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని, ఇలా డబ్బులిచ్చి పక్కోళ్ల మీద బురద చల్లడం ఏ మాత్రం భావ్యం కాదని, యూట్యూబ్ కామెంట్ల రూపంలో ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేసే వాళ్ళు కంటెంట్ చూశాక మాట్లాడితే స్వాగతిస్తామని అన్నారు. అందరి సినిమాలు బాగుండాలని కోరుకుంటామని, ఒకవేళ తమ కంటే అపోజిషన్ మూవీ బాగుంటే దాన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇక్కడ దాకా బాగానే ఉంది.
అయితే ట్రోలింగ్ ని ఉద్దేశించి ఇదంతా ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళను బ్రదర్ అని ఉద్దేశిస్తూ వెంట్రుకల గురించి అన్న మాట అభ్యంతరకరంగా ఉంది. బన్నీ వాస్ ఛోటా మోటా ప్రొడ్యూసర్ కాదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు. మొన్నటి దాకా గీతా ఆర్ట్స్ ని అరవింద్ వెనుకుండి నడిపించినవారు. జనసేన పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నవారు. ఇప్పుడు స్వంతంగా బ్యానర్ పెట్టి లిటిల్ హార్ట్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నారు. ప్రొడక్షన్ లోనే కాదు డిస్ట్రిబ్యూషన్ లోనూ బన్నీ వాస్ కున్న అనుభవం దశాబ్దాల నాటిది. సో ఆవేశం కన్నా ఆలోచన ఇక్కడ చాలా అవసరం.
ఒక అగ్ర నిర్మాతగా ఎదిగే క్రమంలో బన్నీ వాస్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్రోలింగ్స్, నెగటివ్ క్యాంపైన్స్ కొత్తగా పుట్టుకు రాలేదు. అలాంటివాటిని కట్టడి చేయాల్సిందే. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే మంచు విష్ణు ఈ విషయంలో పాటించిన స్ట్రాటజీ మంచి ఫలితాలు ఇవ్వడం చూశాం. బన్నీ వాస్ తాజాగా సైబర్ క్రైమ్ కి కంప్లయింట్ ఇస్తే ఆల్రెడీ ముగ్గురిని పట్టేసుకున్నారు. ఇలాంటి చర్యలు చేయాలి తప్పించి కేశాలు, మోసాలు అంటూ బూతులు మాట్లాడితే ఆన్ లైన్ లో వైరల్ కంటెంట్ అవుతుందేమో కానీ గౌరవం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మనసులో బాధ తీవ్రంగా ఉండొచ్చు. కానీ దాన్ని వ్యక్తపరిచే క్రమంలో సంయమనం చాలా అవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates