స్వీట్ 25 – సంచలనాల ‘నువ్వే కావాలి’

సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 2000 అక్టోబర్ 13 నువ్వే కావాలి విడుదలయ్యింది. పరిమిత థియేటర్లలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ చేశారు. ఉషాకిరణ్ బ్యానర్ కావడంతో ప్రమోషన్ల పుణ్యమాని యూత్ మంచి ఓపెనింగ్సే ఇచ్చారు. ఆడియో ముందే హిట్టవ్వడం కలిసొచ్చింది. కానీ అసలు కథ మొదటి షో పూర్తయ్యాక మొదలయ్యింది. ఫస్ట్ డే మొదటి ఆటకు సులభంగా దొరికిన టికెట్లు మూడో రోజు వచ్చేనాటికి బ్లాక్ లో డబుల్ రేట్ ఇస్తామన్నా దక్కే పరిస్థితి కనిపించలేదు. హైదరాబాద్ తో మొదలుపెట్టి అమలాపురం దాకా ప్రతి చోటా ఒకటి రెండు కాదు యాభై వంద రోజుల దాకా హౌస్ ఫుల్ బోర్డు ఏ థియేటర్ దగ్గర తీసేయలేదు.

ఇంతటి ప్రభంజనం వెనుక జరిగిన యుద్ధం చాలా చిన్నది. 1999. మలయాళంలో రిలీజైన నిరం చూసిన దర్శకుడు విజయ్ భాస్కర్ కి దాన్ని తెలుగులో తీస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. అప్పటికే తన కాంబో కోసం సిద్ధంగా ఉన్న నిర్మాత రామోజీరావుని కలిసి ఈ ఆలోచన వివరించారు. నిరం చూసాక అంతగా ఏం లేదే అనిపించినా విజయ్ భాస్కర్ మీద నమ్మకంతో ఆయన సరేనన్నారు. మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చకచకా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అగ్ర హీరోల కమర్షియల్ సినిమాలకు పని చేస్తున్న కోటితో అద్భుతమైన పాటలు చేయించుకున్నారు. సిరివెన్నెల, భువనచంద్ర సాహిత్యం ప్రాణం పోసింది.

హీరో కోసం వెతుకుతూ ఉండగా రోజారమణి గారబ్బాయి, చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డులు కూడా సాధించిన తరుణ్ ని కాలేజీ స్టూడెంట్ గా చూశాక మరో ఆలోచన చేయకుండా లాక్ చేసుకున్నారు. హీరోయిన్ గా రిచా, మరో హీరోగా సాయికిరణ్ తో పాటు గిరిబాబు, అన్నపూర్ణ, చంద్రమోహన్, ఎంఎస్, చలపతిరావు లాంటి సీనియర్ ఆర్టిస్టులు అండగా నిలబడ్డారు. చాలా పరిమిత బడ్జెట్ లో నువ్వే కావాలి పూర్తయ్యింది. ముప్పాతిక సినిమా మనసారా నవ్వుకున్న యూత్ చివర్లో కన్నీళ్లు పెట్టుకుని శుభం కార్డు వేశాక ఆనందంగా బయటికి వచ్చి మళ్ళీ మళ్ళీ చూడాలని డిసైడ్ అయ్యారు. కేవలం కోటిన్నరలో తీస్తే ఇరవై కోట్లకు పైగా వసూలు చేయడం ఒక చరిత్ర.