శుక్రవారం దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగు వారే కాదు, భారతీయ సినీ ప్రేమికులందరూ ఆయన్ని శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. ఒక దర్శకుడి మీద ఇండియా అంతటా ఏమాత్రం నెగెటివిటీ లేకుండా అభిమానం చూపించడం అరుదైన విషయం. గతంలో సగటు మాస్ దర్శకుడంటూ ఆయన్ని తక్కువ చేసిన వాళ్లు కూడా మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాక ఆయన మీద నెగెటివిటీనంతా పక్కన పెట్టి అభిమానులుగా మారిపోయారు.
ఒక సాధారణ మాస్ మసాలా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు దేశమే గర్వించే స్థాయిలో, ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా నిలవడం అంటే చిన్న విషయం కాదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, తనను తాను మలుచుకుంటూ, గొప్ప కలలు కని వాటికి దృశ్యరూపం ఇవ్వడం కోసం తపిస్తూ సాగడం వల్లే రాజమౌళి ఇలాంటి అద్భుతాలను ఆవిష్కరించగలిగాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీతో జక్కన్న మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అందరి అంచనా.
రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా బాహుబలి టీం ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అది చూస్తే.. రాజమౌళి సినిమాలు అంత గొప్పగా ఎలా రూపొందుతున్నాయో.. సినిమా కోసం ఆయన ఎంత కష్టపడతాడో, సెట్స్‌లో ఎంత తపన చూపిస్తాడో అర్థమవుతుంది. తెరపై ఎంతో గొప్పగా అనిపించిన సన్నివేశాల్లో నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం వెనుక జక్కన్న ఇంత కష్టపడతాడా.. ఆర్టిస్టులకు ఇంత స్పూన్ ఫీడింగ్ ఇస్తాడా.. అందుకే ఆ సన్నివేశాలు అలా రూపొందాయా అనిపించేలా బిహైండ్ ద సీన్స్‌తో ఆ వీడియోను రూపొందించింది బాహుబలి టీం.
రాజమౌళి దర్శకుడిగా అంతెత్తులో ఎందుకు ఉన్నాడో చెప్పడానికి ఈ వీడియో రుజువు. బాహుబలి రీ రిలీజ్ మీద కూడా జక్కన్న చూపిస్తున్న శ్రద్ధ ఎలాంటిదో.. ఆయన మార్కెటింగ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో గత కొన్ని రోజులుగా అందరూ చూస్తున్నారు. ఒక కొత్త సినిమా తరహాలో ఇది బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నెల 31న మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను రాజమౌళి రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates