యానిమల్ సంగీత దర్శకుడి దశ తిరిగింది

హర్షవర్షన్ రామేశ్వర్. ఈ పేరు మ్యూజిక్ లవర్స్ కు బాగా పరిచయమే కానీ సాధారణ ప్రేక్షకులకు తమన్, దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలిసినంతగా ఇతని గురించి అవగాహన తక్కువ. అర్జున్ రెడ్డికి పాటలు కంపోజ్ చేసింది రదనే కానీ బ్యాక్ గ్రౌండ్ తో ప్రాణం పోసిన హర్షవర్ధన్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువ. యానిమల్ కు ఇచ్చిన బీజీఎమ్, కంటెంట్ స్థాయిని పదింతలు పెంచిందనేది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇతని వర్క్ ఏ స్థాయి అంటే స్పిరిట్ ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే దానికి సంబంధించిన నేపధ్య సంగీతాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే చేయించుకునేంత.

మరి ఇంత టాలెంట్ ఉన్న హర్షవర్ధన్ రామేశ్వర్ ప్లానింగ్ పరంగా దూకుడుగా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు తన చేతికి రెండు క్రేజీ ప్రాజెక్టులు వచ్చాయి. పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కలయికలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ కు కంపోజర్ గా తన పేరునే అధికారికంగా ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్  ద్వారా తనతో పాటూ కంబ్యాక్ అయిన మణిశర్మను కాకుండా పూరి ఈసారి ఛాయస్ మార్చుకోవడం గమనార్హం. త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్ కలయికలో తెరకెక్కబోతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా హర్షవర్ధన్ చేతికే వచ్చింది. ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

గత కొన్నేళ్లుగా తమన్ తప్ప వేరే ఆప్షన్ పెట్టుకోని త్రివిక్రమ్ ఇప్పుడు హర్షవర్ధన్ వైపు మొగ్గు చూపేందుకు కారణాలు లేకపోలేదు. ఒకటి ఫ్రెష్ మ్యూజిక్ కావడం. రెండోది తమన్ బిజీగా ఉండటం. అఖండ 2, రాజా సాబ్ తదితర ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతో సతమతమవుతున్న తమన్ ఇప్పటికిప్పుడు వేగంగా వర్క్ చేసే పరిస్థితిలో లేడు. అందుకే హర్షవర్షన్ కు ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. ఇవి కాకుండా మరో రెండు తమిళ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. వెంకటేష్, విజయ్ సేతుపతి, ప్రభాస్ ఇలా వరసగా స్టార్ హీరోలతో జట్టు కడుతున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇదే దూకుడు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరిక.