రజినీ, కమల్ మల్టీస్టారర్.. అతను రేసులో లేడు

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో కొన్ని దశాబ్దాల విరామం తర్వాత ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో కలిసి పలు చిత్రాల్లో నటించిన ఈ దిగ్గజ ద్వయం.. తర్వాత ఎవరి దారిలో వాళ్లు ప్రయాణం చేశారు. ఇక మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా చూడలేం అని అభిమానులు అనుకున్నారు కానీ.. తాము కలిసి సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే కమల్, రజినీ వేర్వేరుగా కన్ఫమ్ చేశారు. 

కమల్‌తో ‘విక్రమ్’; రజినీతో ‘కూలీ’ చేసిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది. తామిద్దరం సినిమా చేయబోతున్నామని, దర్శకుడు మాత్రం ఇంకా ఖరారు కాలేదని రజినీ ఇటీవల వ్యాఖ్యానించాడు. దీంతో ఆ సినిమాకు దర్శకుడు ఎవరా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. కమల్, రజినీలతో సినిమా చేయబోతున్నట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఐతే ప్రదీప్ సైతం తాను రేసులో లేనని తేల్చేశాడు. ఐతే ఈ సినిమా కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమే అన్నట్లుగా అతను సంకేతాలు ఇచ్చాడు. దాని గురించి తాను వివరంగా మాట్లాడలేనని, కానీ తాను ఈ లెజెండరీ కాంబినేషన్లో సినిమా చేయట్లేదని అతను స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి తన ఫోకస్ నటన మీదే ఉందని అతను చెప్పాడు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రదీప్ కొత్త చిత్రం ‘డూడ్’ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఆ తర్వాత ‘ఎల్ఐకే’ సినిమా వస్తుంది. ఆ తర్వాత కూడా హీరోగా మరో సినిమా చేస్తానని.. ఆ తర్వాత తన దర్శకత్వంలో భారీ సైఫై థ్రిల్లర్ వస్తుందని ప్రదీప్ వెల్లడించాడు. తమిళ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఆ చిత్రాన్ని రూపొందించాలని అనుకుంటున్నట్లు ప్రదీప్ తెలిపాడు. జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్.. ‘లవ్ టుడే’తో బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత అతను హీరోగా నటించిన ‘డ్రాగన్’ కూడా బ్లాక్‌బస్టర్ అయింది. ‘డూడ్’ మీదా మంచి అంచనాలే ఉన్నాయి.