క్రేజీ ప్రాజెక్టులో సమంత?

విడాకులు, అనారోగ్యం, ఇతర కారణాలతో సమంత ఫిలిం కెరీర్ కొంత నెమ్మదించిన మాట వాస్తవం. తెలుగులో అయితే ఆమె నుంచి కొత్త సినిమాలే రావడం లేదు. తన ప్రొడక్షన్లో రూపొందిన ‘శుభం’ చిత్రంలో చిన్న అతిథి పాత్ర చేయడం తప్పితే.. సామ్‌ మరే చిత్రంలోనూ నటించలేదు. ‘మా ఇంటి బంగారం’ పేరుతో సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయింది కానీ.. అది ఎంతకీ మొదలు కావడం లేదు. 

ఐతే ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే మొదలు కానున్నట్లు సమంత తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో ఆమెకు తమిళంలో ఒక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అది ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన వెట్రిమారన్ చిత్రంలో కావడం విశేషం. అందులో శింబు హీరోగా నటించనున్నాడు. ఇది కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్లో ఒకటని చెప్పొచ్చు.

ఇటీవలే వెట్రిమారన్, శింబు కలయికలో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. వెట్రిమారన్ ఫిల్మోగ్రఫీలో టాప్‌లో ఉండే ‘వడ చెన్నై’ తరహాలోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘అరసన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసి ప్రి లుక్ రిలీజ్ చేశారు. కోలీవుడ్లో ఆరంభానికి ముందే అత్యంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటి. ఇందులో కథానాయికగా సమంతను ఖరారు చేశారని తమిళ మీడియా టాక్.

వెట్రిమారన్ సినిమాలంటే కథానాయికలకూ చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లకు ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చి వారి నుంచి ది బెస్ట్ రాబట్టుకుంటాడు వెట్రిమారన్. విడుదల, అసురన్, వడ చెన్నై.. ఈ సినిమాలన్నింట్లోనూ హీరోయిన్ల పాత్ర కీలకం. హీరోయిన్‌గా కెరీర్ ముగింపు దశకు వచ్చేసింది అనుకుంటున్న దశలో సమంతకు నిజంగా ఈ ఛాన్స్ వస్తే అది ఆమెకు గొప్ప ఊరటే. ఓవైపు ‘అరసన్’, ఇంకోవైపు ‘మా ఇంటి బంగారం’ చిత్రాలతో సమంత బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్లే.