వాహ్ జీ – ట్రిపుల్ సెంచరీ దాటిన ఓజి

మొన్నటి దాకా స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేకులే చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మీద అభిమానుల్లో ఒకరకమైన అసంతృప్తి. సరే పోన్లే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు హిట్టయితే చాలని కోరుకుంటే అదేమో దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఏపీ డిప్యూటీ సిఎంగా ఆనందం ఒక పక్క ఉన్నా, బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సత్తా చాటితే చూడాలని కోట్లాది ఫ్యాన్స్ కోరుకున్నారు. అది ఓజి నెరవేర్చింది. గత కొన్నేళ్లలో ఇంత పాజిటివ్ టాక్ వచ్చిన పవన్ మూవీ ఇదే. వకీల్ సాబ్ బాగుందన్నారు కానీ ఫుల్ మీల్స్ ఫీలింగ్ కలిగించలేదు. కానీ ఓజి అలా కాదు. రిపీట్ షోలు వేసుకునేలా ప్రేరేపించింది.

అందుకే పదకొండు రోజులకే 308 కోట్ల గ్రాస్ దాటేసి మూడో వారం వైపు పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి సాధారణ టికెట్ రేట్లు అందుబాటులోకి రావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయనే నమ్మకంతో బయ్యర్లు ఉన్నారు. కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఇచ్చిన పోటీ వల్ల ఏ సెంటర్స్ లో ప్రభావం ఉన్నప్పటికీ పవన్ ఇమేజ్ వల్ల ఆక్యుపెన్సీలు స్టడీగా ఉన్నాయి. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లలో హౌస్ ఫుల్స్ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి సోమవారం నుంచి డ్రాప్ సహజమే కానీ అదెంత మొత్తంలో ఉందనేది రేపటికి క్లారిటీ వస్తుంది. భయపడేంత పడిపోలేదనేది ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్.

దీంతో 2025 హయ్యెస్ట్ గ్రాసర్ గా ఓజి నిలిచిందని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. ఫ్యాన్స్ కోరుకున్నట్టు అయిదు వందల కోట్లకు చేరుకోవడం అంత సులభమైతే కాదు. ఎందుకంటే మొదటి వారంలోనే ఈ లాంఛనం జరిగిపోయి ఉండాలి. టికెట్ రేట్లు, సెన్సార్ ఏ సర్టిఫికెట్ లాంటి కొన్ని కారణాలు వసూళ్లకు ప్రతిబంధకంగా నిలిచాయి, లేదంటే ఇంకా మెరుగైన నెంబర్లు వచ్చేవనే కామెంట్లో నిజం లేకపోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కి ఇప్పుడీ ఓజి సక్సెస్ ఇంధనంలా పని చేయనుంది. ఓజి దర్శకుడు సుజిత్ మాత్రం దీన్నో సినిమాటిక్ యునివర్స్ గా తీర్చిదిద్ది బోలెడు సర్ప్రైజులు ఇస్తానని అంటున్నారు.