బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కిల్’ మూవీ చూసిన వాళ్లెవ్వరూ అందులో విలన్ పాత్ర చేసిన రాఘవ్ జుయెల్‌ను అంత సులువుగా మరిచిపోలేరు. ట్రైన్స్ మీద పడి ప్రయాణికులపై పాశవిక దాడి చూస్తూ, దోచుకునే దొంగల ముఠా నాయకుడిగా అతడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో నటించి గొప్ప పేరే సంపాదించాడు రాఘవ్. ఈ ఒక్క సినిమాతో అతను బాలీవుడ్లో బిజీ అయిపోయాడు. ఇటీవలే ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో పలకరించిన ఈ యువ నటుడు.. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
నేచురల్ స్టార్ నాని మూవీ ‘ది ప్యారడైజ్’లో అతను ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు మెయిన్ విలన్ కాగా.. రాఘవ్‌ది కూడా నెగెటివ్ రోలే అని తెలుస్తోంది. ‘ప్యారడైజ్’ గురించి ఒక ఇంటర్వ్యూలో అతను ఇచ్చిన ఎలివేషన్ చూసి నాని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
‘ది ప్యారడైజ్’ను అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాగా రాఘవ్ జుయెల్ అభివర్ణించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే కాక.. అంతర్జాతీయంగా కూడా కొన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఐతే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదని.. ఇంటర్నేషనల్‌గా కూడా ఈ సినిమా మంచి ప్రభావం చూపుతుందని రాఘవ్ ధీమా వ్యక్తం చేశాడు.
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇదని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్ అద్భుతమని.. ప్రేక్షకులకు అతను థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాడని రాఘవ్ తెలిపాడు. ఈ సినిమాలో తన లుక్ షాకింగ్‌గా ఉంటుందని.. దాని కోసం ఎదురు చూడాలని రాఘవ్ అన్నాడు. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నానని.. అది కష్టంగా ఉన్నప్పటికీ, సవాలుగా తీసుకుని పని చేస్తున్నానని రాఘవ్ తెలిపాడు. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates