మంచినీళ్లు తాగినంత తేలిగ్గా మూడు వందల కోట్లు

కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ అంచనాలకు మించి మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. రిలీజ్ కు ముందు ఉన్న నెగటివిటీ, కాంట్రవర్సీ అన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోయి ఆడియన్స్ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. కర్ణాటక వసూళ్లు భీభత్సంగా ఉన్నాయి. థియేటర్ల దగ్గర జనాల గుంపు జాతరను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బళ్లారి, హుబ్లీ, రాయచూర్ లాంటి జిల్లా కేంద్రాల్లో గేట్లు తోసుకుని మరీ జనాలు లోపలి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణ దాదాపు అన్ని చోట్ల నిన్న హౌస్ ఫుల్స్ నమోదు చేసిన కాంతర చాప్టర్ 1 ఏ లెజెండ్ కు ఇవాళ్టి నుంచి అసలు పరీక్ష మొదలుకానుంది.

ఇక లెక్కల విషయానికి వస్తే నాలుగు రోజుల వీకెండ్ తర్వాత కాంతార చాప్టర్ 1 సుమారుగా మూడు వందల ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. అన్ని భాషలు కలిపే అయినా దీనికి విడుదలకు ముందు ఉన్న బజ్ తో పోలిస్తే ఇది చాలా పెద్ద నెంబర్. బుక్ మై షోలో వరసగా గురువారం నుంచి ఆదివారం దాకా రోజు పది లక్షలకు పైగా టికెట్లు అమ్మిన శాండల్ వుడ్ మూవీగా మరో రికార్డు సొంతం చేసుకుంది. డిస్ట్రిక్ట్ యాప్ కాకుండానే ఇన్ని అమ్మకాలు జరగడం అనూహ్యం. ఫస్ట్ డే నుంచే ఈ ట్రెండ్ చూపించిన కాంతార దాన్ని అలాగే స్టడీగా కొనసాగించడం మెచ్చుకోవాల్సిన విషయం.

ఇప్పుడు కాంతార చాప్టర్ 1 ముందున్న నెక్స్ట్ టార్గెట్ అయిదు వందల కోట్ల క్లబ్. వచ్చే వారాంతానికి ఇది కూడా అయిపోతుంది. అయితే వెయ్యి కోట్లను అందుకోవడం అనుమానమే అంటున్నాయి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు. టాక్, పబ్లిక్ రెస్పాన్స్ ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నా కాంతార మొదటి భాగం స్థాయిలో దీనికి లాంగ్ రన్ ఉండటం మీద అనుమానాలు లేకపోలేదు. కాకపోతే ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడులో స్ట్రాంగ్ గా ఉండటం శుభ సంకేతంగా చెప్పొచ్చు. మళ్ళీ అక్టోబర్ 16 దాకా మధ్యలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి కాంతార స్పీడ్ అంత ఈజీగా తగ్గేలా లేదు. దీపావళి దాకా సందడి కొనసాగేలా ఉంది.