గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సెన్సేషన్ అంటే.. ‘కాంతార’ అనే చెప్పాలి. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కన్నడేతర భాషల వాళ్లకు అస్సలు పరిచయం లేదు. సినిమాలో ఇంకెవరూ పేరున్న ఆర్టిస్టులు లేరు. మూడేళ్ల ముందు కన్నడలో ఓ మోస్తరు అంచనాలతో విడుదలైందీ చిత్రం. కానీ అక్కడ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడం.. రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాదమై రిలీజ్ కావడం.. రెండు చోట్లా అనూహ్యమైన ఆదరణ సంపాదించుకుని సంచలనం సృష్టించడం.. అన్నీ ఒక కలలా జరిగిపోయాయి.
దెబ్బకు ‘కాంతార: చాప్టర్-1’కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. తొలి రోజే రూ.89 కోట్ల మేర వసూళ్లు సాధించే స్థాయి హైప్‌తో సినిమా రిలీజైంది. వీకెండ్లో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. ఫుల్ రన్లో ఈజీగా రూ.500 కోట్ల మార్కును దాటేలా ఉంది ‘కాంతార: చాప్టర్-1’.
ఇంతటి సంచలనం రేపుతున్న కథకు పునాది ఎలా పడింది అన్నది ఆసక్తికరం. ఈ విషయాన్నే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు రిషబ్ శెట్టి. ‘‘20 ఏళ్ల కిందట మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన ‘కాంతార’కు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక అటవీ అధికారికి, రైతుకు మధ్య ఘర్షణ జరిగింది. నేను దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా చూడలేదు.
అడవిని కాపాడే అధికారి, భూమి కోసం పోరాడే రైతు.. ఇద్దరి తాపత్రయం ఒక్కటే. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఆ ఘర్షణే నాకు ‘కాంతార’ కథ రాయడానికి స్ఫూర్తిగా నిలిచింది. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో గ్రామీణ సంప్రదాయాల మీద దృష్టిపెట్టి ‘కాంతార’ కథ రాశాను’’ అని రిషబ్ వెల్లడించాడు. కన్నడనాట గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో ‘కాంతార’ సాగుతుందన్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates