6 ఫ్లాపుల తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్

సప్తసాగరాలు దాటి సైడ్ ఎబి కన్నడలో పెద్ద విజయం సాధించింది కానీ తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ భాషల్లో ఆశించిన స్పందన దక్కించుకోలేదు. అయితే హీరోయిన్ రుక్మిణి వసంత్ మనసులు గెల్చుకుంది, మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఎలాంటి గ్లామర్ కోటింగ్ లేకుండా చక్కని హావభావాలతో ఆమె చూపించిన నటన విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. తన కోసమే సీక్వెల్ చూసినవాళ్లు ఎందరో. ఈ ఒక్క సినిమాతో తన జాతకం మారిపోతుందని అందరూ భావించారు. అవకాశాలు చాలానే వచ్చాయి కానీ రుక్మిణి వసంత్ కు షాక్ ఇచ్చిన విషయం ఏంటంటే దాని తర్వాత ఏకంగా అర డజను ఫ్లాపులు దక్కడం

గోల్డెన్ స్టార్ గణేష్ చేసిన ‘బాణాదారియల్లి’ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ప్రశాంత్ నీల్ కథ అందించిన శ్రీమురళి ‘బఘీరా’ తేడా కొట్టేసింది. శివరాజ్ కుమార్ తో నటించిన ‘భైరతి రానగల్’ ఒరిజినల్ వెర్షన్ సోసో అనిపించుకోగా డబ్బింగుల్లో డిజాస్టర్ అయ్యింది. నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కరుడుగట్టిన మూవీ లవర్స్ కూడా ఠక్కున చెప్పలేరు. విజయ్ సేతుపతి ‘ఏస్’ కూడా ఇదే క్యాటగిరీలో చేరింది. ఇటీవలే విడుదలైన శివ కార్తికేయన్ ‘మదరాసి’ సైతం ఈ క్యూలోనే కలిసి పోయింది. ఇన్ని చేదు జ్ఞాపకాల తర్వాత రుక్మిణి వసంత్ కు ‘కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్’ రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది.

ఇందులో తను పోషించిన కనకవతి క్యారెక్టర్ రెగ్యులర్ హీరోయిన్ తరహాలో కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్ లో రిషబ్ శెట్టి ప్రెజెంట్ చేసిన తీరు సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి షేడ్ ఊహించని ఫ్యాన్స్ కొంత షాక్ అయినా ఆర్టిస్టుగా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటివి చేయాలి కాబట్టి ఆ కోణంలో సర్దిచెప్పుకున్నారు. ఏదైతేనేం రుక్మిణి వసంత్ ఫిల్మోగ్రఫీలో ఇంకో సూపర్ హిట్టు తోడయ్యింది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్), యష్ టాక్సిక్ రెండు ప్యాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇవి కూడా హిట్టు కొడితే రుక్మిణి వసంత్ కెరీర్ మలుపు తిరిగినట్టే.