సూప‌ర్ ఫ‌న్ కాంబో మ‌ళ్లీ

యువ క‌థానాయ‌కుడు శ్రీ విష్ణు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌. ఎక్కువగా సీరియ‌స్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన అత‌ను.. ఈ సినిమా త‌ర్వాత ఎంట‌ర్టైన‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాడు. త‌న చివ‌రి చిత్రం సింగిల్‌కు కింగ్ ఆఫ్ ఎంట‌ర్టైన్మెంట్ అని ట్యాగ్ వేసుకోగ‌లిగాడు అంటే.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న వేసిన పునాదే కార‌ణం. అప్ప‌టికే వివాహ భోజ‌నంబు సినిమా తీసిన రామ్ అబ్బ‌రాజుకు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పెద్ద బ్రేకే ఇచ్చింది. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించి, 2023 బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న.

దీని త‌ర్వాత రామ్ అబ్బ‌రాజు.. శ‌ర్వానంద్ హీరోగా నారి నారి న‌డుమ మురారి అనే సినిమా తీస్తున్నాడు. అది చివ‌రి ద‌శ‌లో ఉంది. అది రిలీజ్ కాక‌ముందే రామ్ అబ్బ‌రాజు కొత్త సినిమా ఖ‌రారైంది. అత‌ను మ‌ళ్లీ శ్రీ విష్ణుతో జ‌ట్టు క‌ట్ట‌బోతుండ‌డం విశేషం. వీరి క‌ల‌యిక‌లో కొత్త చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయ‌బోతోంది.

ద‌స‌రా కానుక‌గా ఈ సినిమాను గురువారం అనౌన్స్ చేయ‌బోతున్నారు. ఈసారి వినోదం ఇంకా పెద్ద స్థాయిలో, వైల్డ్‌గా ఉంటుంద‌ని ప్రి లుక్ పోస్ట్ ద్వారా సంకేతాలు ఇచ్చారు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న కాంబో అంటే ఈసారి డ‌బుల్ వినోదాన్ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. మైత్రీ సంస్థ ప్రొడ‌క్ష‌న్ అంటే సినిమా రేంజ్ కూడా పెద్ద‌గానే ఉండొచ్చు.

మ‌రి ఈసారి శ్రీవిష్ణు, రామ్ ఏ స్థాయిలో న‌వ్విస్తారో చూడాలి. శ్రీ విష్ణు ప్ర‌స్తుతం మృత్యుంజ‌య్, హీరో హీరోయిన్ అనే రెండు కొత్త చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అందులో ఒక‌టి ఈ ఏడాది చివ‌ర్లో రిలీజ‌య్యే అవ‌కాశ‌ముంది. వ‌చ్చే ఏడాది శ్రీ విష్ణు నుంచి రెండు రిలీజ్‌లు ఉండొచ్చు. ఇక రామ్ సినిమా నారి నారి న‌డుమ మురారి న‌వంబ‌రులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.