నిన్న మెగా ఫ్యామిలీ మొత్తం ప్రసాద్ ల్యాబ్స్ లో ఓజి చూసేసింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అకీరానందన్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా కుటుంబ సభ్యులంతా ఏదో వేడుకకు వచ్చినంత సంబరంగా మూడు గంటలు థియేటర్లో గడిపేసి వెళ్లిపోయారు. మీడియాను అనుమతించలేదు కానీ సరిపడా కెమెరాలైతే షోకు ముందు వెనుకా వీడియో కవరేజ్ చేశాయి. ఆట పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చిన వాళ్ళను ఉద్దేశించి ఓజి 2 ఉంటుందని ప్రకటించారనే వార్త ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చింది. ఇటీవలే తమన్ ఒక ఇంటర్వ్యూలో ఓజి ఒక్క భాగంతో ఆగదని చెప్పిన సంగతి తెలిసిందే.
సరే వినడానికి బ్రహ్మాండంగా ఉంది కానీ ఓజి 2 ఇప్పటికిప్పుడు వెంటనే పట్టాలు ఎక్కకపోవచ్చు. ఎందుకంటే దర్శకుడు సుజిత్ నెక్స్ట్ నానితో లాకైపోయాడు. ఈ వారంలోనే లాంచింగ్ అంటున్నారు కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే ప్యారడైజ్ అయ్యాకే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ఒకవేళ ఓజి 2ని హఠాత్తుగా మొదలుపెట్టాలంటే అవతల నాని సుజిత్ ని కొంత కాలం త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు కోసమే వేరేవారికి కమిట్ మెంట్ ఇవ్వని నాని దానికి సుముఖంగా ఉండకపోవచ్చు, పవన్ వ్యక్తిగతంగా అడిగితే తప్ప.
అయినా ముందసలు ఓజి 2 స్క్రిప్ట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. ఓజస్ గంభీర ముంబైకి రాకముందు జపాన్ లో ఏం చేశాడు, ఎలాంటి రక్తపాతం సృష్టించాడు, సాహోలో ఉన్న వాజి ప్రపంచానికి ఓజికి లింక్ ఏంటి లాంటి ప్రశ్నలు అన్నింటికీ సీక్వెల్ లోనే సమాధానం చెప్పాలి. ఓజికొచ్చిన రెస్పాన్స్ చూసి పవన్ చాలా హ్యాపీగా ఉన్నారట. హరిహర వీరమల్లు లాంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్స్ కన్నా ఓజి లాంటి గ్యాంగ్ స్టర్ డ్రామా అయితే ఆడియన్స్ వేగంగా కనెక్ట్ అవుతున్నారనేది అర్థమయ్యింది. పైగా ఎలివేషన్లు చూపించిన తీరు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ఓజి 2 ఎప్పుడనేది మాత్రం కొంచెం సస్పెన్సే.
Gulte Telugu Telugu Political and Movie News Updates