ప్రభాస్ అభిమానులు ఫుల్లు హ్యాపీ

ది రాజా సాబ్ ట్రైలర్ చూశాక ప్రభాస్ అభిమానులకు కొండంత ధైర్యం వచ్చింది. తమ హీరోని ఏళ్ళ తరబడి ఎలా చూడాలనుకుంటున్నామో అచ్చంగా అదే తీరులో ఇంకా చెప్పాలంటే అంతకు మించి చూపించిన దర్శకుడు మారుతీకి కృతజ్ఞతలు చెబుతున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ రాలేదు. కల్కి 2898 ఏడి, సలార్ అంత హిట్టయినా అవి సీరియస్ జానర్లే, ఆదిపురుష్, సాహో, రాధే శ్యామ్ ఫలితాల సంగతి పక్కనపెడితే వాటిలో వినోదం పాళ్ళు తక్కువ. అందుకే డార్లింగ్ తన వింటేజ్ నెస్ బయటపెట్టలేకపోయాడు.

ఇప్పుడు రాజా సాబ్ రూపంలో ఆ అవకాశం దక్కింది. హారర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్, మాస్ మసాలా, స్పెషల్ సాంగ్స్, మాస్ మూమెంట్స్, గ్లామర్ హీరోయిన్స్ ఒకటా రెండా అన్నీ పెట్టేశారు. కథ పరంగా మరీ గొప్పగా ఉండకపోవచ్చు. ఒక బంగాళా చుట్టూ డ్రామా నడిపించి హీరో గ్యాంగ్ ని అందులో పడేసి, ఒక ఫ్లాష్ బ్యాక్ తో ఇంకో ప్రభాస్ ని ప్రవేశపెట్టి ఇలా ఏదో కొత్తగానే ట్రై చేశారు. స్టోరీ ఎలా ఉన్నా ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకున్న అంశాలు కనక సరిగ్గా బ్యాలన్స్ అయితే కనకవర్షం ఖాయం. మిర్చి, బుజ్జిగాడు, ఈశ్వర్ నాటి మాస్ ని తవ్వితీయడానికి మారుతీ పడిన కష్టం విజువల్స్ లో కనిపిస్తూనే ఉంది.

తెలివిగా మూడు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా ప్యాన్ ఇండియా సినిమాలకో దారి చూపించిన రాజా సాబ్ బృందం రాబోయే వంద రోజులకు సరిపడా ప్రణాళిక సిద్ధం చేసుకుందట. అసలే సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొంది. సోలోగా వస్తే ఏ టెన్షన్ ఉండేది కాదు కానీ ప్రభాస్ కు ఈసారి చిరంజీవి, నవీన్ పోలిశెట్టి, రవితేజ, విజయ్, శివ కార్తికేయన్ విపరీతమైన పోటీ ఇవ్వబోతున్నారు. సో రాజా సాబ్ ప్రమోషన్లను ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. మారుతీ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. దెయ్యంతో ఇంత మాస్ చూపించడం ఒకరకంగా కొత్త ప్రయోగమే.