సుడిగాల్ సుధీర్.. పాన్ వరల్డ్ సినిమా

జబర్దస్త్ కామెడీ షోతో మాంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు.. సుడిగాలి సుధీర్. ఆ షోలో వందల కొద్దీ స్కిట్లతో అతను ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇంకా కొన్ని టీవీ షోల్లో తన ప్రతిభను చాటుకున్న అతను.. అనేక సినిమాల్లోనూ నటించాడు. సుధీర్ హీరోగానూ నాలుగు సినిమాలు చేయడం విశేషం. కానీ అవేవీ అతడికి ఆశించిన విజయాలు అందించలేదు. ‘గాలోడు’ సినిమాకు మాత్రం ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. 

చివరగా ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేసిన సుధీర్.. తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడతను మళ్లీ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈసారి అతను చేస్తోంది పాన్ వరల్డ్ మూవీ అట. ఈ రోజే ఆ సినిమా టైటిల్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్లో చైనీస్, జపనీస్.. ఇలా అంతర్జాతీయ భాషల్లో టైటిల్‌ను రివీల్ చేశారు. తెలుగు టైటిల్ సోమవారం ప్రకటిస్తారట. 

ఏఐ సాయంతో ఈ టైటిలేంటో నెటిజన్లు కనిపెట్టేశారు. ‘హైలెస్సో’ అనే టైటిల్‌తో రాబోతున్నాడు సుడిగాలి సుధీర్. ఈ చిత్రానికి దర్శకుడెవరో ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ నిర్మాత ఎవరో వెల్లడైంది. మెగా ఫ్యాన్ అనే ముద్రతో చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగుతున్న శివ చెర్రీ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కానున్నాడు. కొన్నేళ్ల పాటు సందీప్ కిషన్‌ పీఆర్ వ్యవహారాలు చూసిన శివ.. ఆ తర్వాత రామ్ చరణ్ కాంపౌండ్లోకి వెళ్లాడు. 

చరణ్ అభిమాన సంఘాలను నడిపిస్తూ, పీఆర్ వ్యవహారాలు చూసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. నిర్మాత ఎస్కేఎన్ కూడా ఇలా ఎదిగిన వాడే. ఆ బాటలోనే శివ చెర్రీ కూడా ఇప్పుడు నిర్మాత అవుతున్నాడు. ‘వజ్ర వారాహి సినిమాస్’ పేరుతో నిర్మాణ సంస్థను పెట్టి చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు శివ చెర్రీ.