రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలుస్తుందని అభిమానులు ఆశించిన చిత్రం.. గేమ్ చేంజర్. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ వరల్డ్ హిట్ తర్వాత అతను చేసిన సినిమా ఇది. శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో చరణ్ జట్టు కట్టడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని ఆశించారంతా. కానీ ఆ సినిమా విపరీతంగా ఆలస్యం అయి.. మొదలైన నాలుగేళ్ల తర్వాత కానీ రిలీజ్ కాలేదు. దీని వల్ల బడ్జెట్ తడిసి మోపెడైంది. సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. అంతిమంగా సినిమా డిజాస్టర్ అయింది.
సంగీత దర్శకుడిగా తనకు కూడా ఈ సినిమా చేదు అనుభవమే మిగిల్చిందంటున్నాడు తమన్. ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పని చేసిన తాను.. చివరికి రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లకపోగా.. సినిమా ఫెయిలవడం, థియేటర్లలో పాటలు క్లిక్ కాకపోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని అతనన్నాడు.
‘గేమ్ చేంజర్’కు తమన్ పారితోషకం తీసుకోకుండా ఏమీ లేడు. కానీ తీసుకున్నదంతా ఈ సినిమా కోసమే ఖర్చు పెట్టేశాడట. సినిమాకు పెద్ద పెద్ద సింగర్లను పెట్టడం.. సుదీర్ఘ సమయం పాటలు కంపోజ్ చేయడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ మీద చాలా సమయం, ఎక్కువమంది టెక్నీషియన్లను పెట్టడం వల్ల తనకు పారితోషకంగా వచ్చిన డబ్బంతా స్టూడియోలోనే ఖర్చయిపోయిందని తమన్ తెలిపాడు.
నిర్మాత దిల్ రాజు వచ్చి.. నీ కోసం డబ్బులు మిగుల్చుకో అన్నా కూడా తాను వినలేదని, మొత్తం ఖర్చు పెట్టేశానని తమన్ తెలిపాడు. తాను ఎంతో కష్టపడి, చాలా టైం పెట్టి తీసిన పాటలు.. కొరియోగ్రఫీ సరిగా లేకపోవడం వల్ల ప్రేక్షకులకు కిక్కివ్వలేకపోయాయని తమన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ‘రా మచ్చా రా’, ‘జరగండి’ పాటల్లో కొరియోగ్రఫీ తేలిపోయిందని అతనన్నాడు. రామ్ చరణ్ లాంటి టాప్ డ్యాన్సర్‌ను కొరియోగ్రాఫర్లు ఉపయోగించుకోకపోవడం తనకు చాలా బాధ కలిగించిందన్నాడు. ‘జరగండి’ పాటలో ఒక్క మంచి స్టెప్ పడి ఉంటే అది వేరే లెవెల్లో ఉండేదన్నాడు. ఇక ఎంతో కష్టపడి చేసిన ‘నానా హైరానా’ పాట అసలు సినిమాలోనే లేకపోవడం తనను ఎంతో బాధించిందని తమన్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates