కాంతార చాప్టర్ 1 రిలీజ్ కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. కర్ణాటక బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. అమ్మకాలు పెట్టడం ఆలస్యం వేగంగా పది వేల టికెట్లు అమ్మిన మూవీగా రికార్డుల వేట షురూ చేసింది. ఇటీవలే టికెట్ ధరలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కోర్టు స్టే విధించడంతో నిర్మాతల చెవుల్లో పాలు పోసినట్టయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్న మైత్రి 50 రూపాయల పెంపు అడిగినట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ టాక్. డబ్బింగ్ సినిమా కాబట్టి తెలంగాణలో వార్ 2, కూలికి హైక్ ఇవ్వలేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చారు. ఇప్పుడూ అదే రిపీటయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా కాంతార చాప్టర్ 1కు ముందు రోజు ప్రీమియర్లు వేయడం దాదాపు ఖాయమే అంటున్నారు. అక్టోబర్ 1 ధనుష్ ఇడ్లి కొట్టు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే సాయంత్రం ఏడు నుంచి మొదలుపెట్టి రెండు షోలు వేయాలా లేక నైట్ షో ఒకటి వేసి ఉదయం నుంచి ఎర్లీ షోలు ఇవ్వాలా అనే దాని మీద ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చు. ట్రైలర్ తప్ప ఇప్పటిదాకా హోంబాలే ఫిలిమ్స్ ఎలాంటి ప్రత్యేక ప్రమోషన్లు చేయలేదు. హీరో రిషబ్ శెట్టి ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రేపు జూనియర్ ఎన్టీఆర్ గెస్టుగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఇవన్నీ హైప్ పరంగా ఉపయోగపడి మంచి ఓపెనింగ్స్ తెస్తాయనే ధీమా నిర్మాతల్లో ఉంది. అయితే టికెట్ రేట్లు పెంచుకోకుండా మిరాయ్ లాగా రెగ్యులర్ ధరలతో వెళ్తే మంచి వసూళ్లు వస్తాయనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేం. కానీ తెలుగు హక్కులను భారీ మొత్తానికి కొన్న నేపథ్యంలో పెంపు తప్పకపోవచ్చు. తెలంగాణలో ఎలాగూ 295, 175 గరిష్ట రేట్లు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పర్మిషన్లు అక్కర్లేదు. కానీ ఏపీలో ఇవి 177, 110గా ఉన్నాయి. అందుకే ప్రతిసారి పెంపు కోసం వెళ్లాల్సి వస్తోంది. ఒకవేళ ప్రీమియర్లు ఖరారు అయితే మాత్రం అక్టోబర్ 1 సాయంత్రం నుంచే కాంతార చాప్టర్ 1 హడావిడి చూడొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates