సంక్రాంతికి ఇంకో మూడున్నర నెలల సమయం ఉంది కానీ పండగ రిలీజుల హడావిడి ఇప్పుడే కనిపిస్తోంది. కాకపోతే ఈసారి ప్యాన్ ఇండియా పరంగా కాకుండా కేవలం తెలుగు మార్కెట్ నే టార్గెట్ చేసుకున్న రెండు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల క్లాష్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. చిరంజీవి, నవీన్ పోలిశెట్టిల మధ్య పోలిక ఆకాశాన్ని భూమికి తాకించడమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ తక్కువంచనా వేయడానికి లేదు. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రోజు మధ్య కంటెంట్ పరంగా ఉన్న సారూప్యతలు, ప్రమోషన్ల ప్లాన్లు రానున్న రోజుల్లో చాలా హాట్ టాపిక్ గా మారబోతున్నాయి.
పబ్లిసిటీలో అనిల్ రావిపూడి మార్కు ఎలా ఉంటుందో తెలిసిందే. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడు. అందులోనూ ఇప్పుడు మెగాస్టార్ తో చేస్తున్నాడు. పైగా వెంకటేష్ కూడా ఉన్న మల్టీస్టారర్ కాంబినేషన్. ఇక ఊరికే ఉంటాడా. షూటింగ్ చివరి దశకు రావడం ఆలస్యం తనదైన ముద్రతో ప్రచారాలు మొదలుపెడతాడు. దానికింకా టైం ఉంది. ఈసారి కూడా అనిల్ పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్నాడు. చిరంజీవి మాస్ ఇమేజ్ ని కమర్షియల్ గా వాడుకోవడం కన్నా ఫన్ యాంగిల్ లో రౌడీ అల్లుడు, దొంగ మొగుడు తరహాలో ఆవిష్కరించడానికి కష్టపడుతున్నాడని యూనిట్ టాక్.
ఇక అనగనగా ఒక రోజు దర్శకుడు మారికి ఇలాంటి సౌలభ్యాలు, క్రియేటివ్ ఐడియాలు ఉండవు. అందుకే ఆ బాధ్యతను నవీన్ పోలిశెట్టి తీసుకున్నాడు. తనదయిన ముద్ర చిన్న చిన్న ప్రోమోలో కూడా కనిపిస్తోంది. ఇవాళ వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్ లో తన స్టాంప్ చూపించాడు. ఇది కూడా ఫక్తు ఫన్ మూవీనే. నవ్వుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూ రాసుకున్నారు. ఇటు మన శంకరవరప్రసాద్ గారు, అటు అనగనగా ఒక రాజు రెండూ హీరోల టైమింగ్ మీద లాక్కొచ్చే కంటెంట్లే. మరి ఫైనల్ గా ఎవరు విన్ అవుతారనేది వేచి చూడాలి. రేసులో ఉన్న రాజా సాబ్, జన నాయకుడు, రవితేజ 77లవి వేరు జానర్లు కాబట్టి వీటితో పోల్చడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates