స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోలందరికీ బయటి పెద్ద సంఖ్యలో అభిమానులుంటారు. కొందరికి ఆ నంబర్ కోట్ల సంఖ్యలో ఉంటుంది. ఐతే దీంతో పాటుగా ఇండస్ట్రీలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుని.. సగటు అభిమానుల్లా వారినీ ఎగ్జైట్ చేసే స్టార్ పవర్ కొందరికే ఉంటుంది. అలాంటి అరుదైన కోవకే చెందుతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి వచ్చి.. కొన్నేళ్లకే తనకంటూ సొంత బాణీ ఏర్పరుచుకుని.. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలతో 2000కు అటు ఇటు యువతను ఉర్రూతలూగించిన ఘనత పవన్ సొంతం.
ఆ సమయంలో సామాన్య యువతగా ఉన్న అనేకమంది తర్వాత సినీ రంగంలోకి వచ్చారు. నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అయ్యారు. వాళ్లందరూ పవన్ పేరు చెబితే చాలు ఊగిపోతారు. పవన్ అభిమానులకు నచ్చేలా సినిమాలు చేస్తే, ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే.. ఈ సెలబ్రెటీస్ అందరూ సామాన్య అభిమానుల్లా మారిపోతారు. ఇప్పుడు ‘ఓజీ’ సినిమా వాళ్లందరినీ వారిలోని ఫ్యాన్ బాయ్స్‌ను బయటికి తీసుకొస్తోంది.
నిన్న హైదరాబాద్‌లో అనేక ప్రిమియర్ షోలు సెలబ్రెటీలతో నిండిపోయాయి. ఏఎంబీ, ప్రసాద్ మల్టీప్లెక్స్, విమల్ థియేటర్లు సెలబ్రెటీలతో కళకళలాడాయి. దిల్ రాజు, నాగవంశీ, ఎస్కేఎన్ లాంటి వాళ్లు ఓజీ షర్టులతో థియేటర్లకు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ లాంటి ప్రముఖులు బిగ్ స్క్రీన్లలో సినిమాలు చూశారు.
ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ అన్నయ్య చిరంజీవి తమ్ముడి సినిమా సక్సెస్‌తో పరమానందభరితుడై పోస్టు పెట్టారు. మెగా హీరోల్లో చాలామంది తాము సెలబ్రెటీలమని మరిచిపోయి.. నిన్నట్నుంచి సగటు పవన్ ఫ్యాన్స్‌లాగే వ్యవహరిస్తున్నారు. పవన్‌కు హిట్టు వస్తే ఇండస్ట్రీ మొత్తం సంతోషం కనిపిస్తోంది. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈసారి సినిమాను పెద్దగా టార్గెట్ చేయట్లేదు. ఇలాంటి అభిమానం కొందరికే దక్కుతుందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates