ప్రీమియర్లు మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఓజి మీద తెలంగాణ హై కోర్టు బాంబు వేసింది. మహేష్ యాదవ్ అనే వ్యక్తి వేసిన పిల్ ని పరిగణనలోకి తీసుకుని ఓజికి టికెట్ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులు చెల్లవని, ఇది ప్రీమియర్లకు కూడా వర్తిస్తుందని పేర్కొంటూ తదుపరి హియరింగ్ ని అక్టోబర్ 9కి వాయిదా వేయడం డిస్ట్రిబ్యూటర్లకు శరాఘాతంగా మారింది. ఇప్పటికే దాదాపు అన్ని షోల టికెట్లు అమ్మేశారు. హైదరాబాద్ సింగల్ స్క్రీన్లవి ఏకంగా బ్లాక్ లో మూడు నాలుగు వేలు పలుకుతున్నాయి. అయినా సరే హాట్ కేకుల్లా అభిమానులు కొనేసుకుని హౌస్ ఫుల్స్ పెట్టేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ టైంలో హోమ్ శాఖ ఇచ్చిన అండర్ టేకింగ్ ఇప్పుడీ ఇబ్బందికర పరిస్థితికి కారణమవుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సి వస్తే ఈ రోజుతో సహా రేపటి నుంచి పెట్టిన బుకింగ్స్ అన్నింటిని క్యాన్సిల్ చేసి కొత్త రేట్లతో సవరించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్న గరిష్ట అనుమతి 295 రూపాయలు మల్టీప్లెక్సుకు, 175 రూపాయలు సింగల్ స్క్రీన్ కు పెట్టాలి. ఇదే జరిగితే పంపిణి హక్కులు తీసుకున్న దిల్ రాజుకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్లకు అదనపు మొత్తాన్ని రీ ఫండ్ చేయాల్సి ఉంటుంది.
ఇదంతా కొంత గందరగోళాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. నిర్మాత డివివి దానయ్య తన లీగల్ టీమ్ తో చర్చించడంతో పాటు సమస్యను గంటల వ్యవథిలో పరిష్కారమయ్యే మార్గాలు చూస్తున్నారట. పెంపుకు అనుమతి ఇచ్చిన హోమ్ శాఖా స్పెషల్ సెక్రటరీ సైతం దీనికి సంబంధించి ఏం చేయాలనే దాని గురించి అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కోర్ట్ ఆర్డర్ పాటించాల్సి వచ్చినా షోలు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. రీ ఫండ్ కి హామీ ఇచ్చి రేపటి నుంచి సాధారణ రేట్లు పెట్టాల్సి ఉంటుంది. రాబోయే గంటల్లో జరిగే పరిణామాలు కీలకం కాబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates