కళ్యాణ్ కోసం కొరియర్లుగా మారారు

అభిమానం అంటే కేవలం టికెట్లు కొని సినిమా చూడటం, కటవుట్లకు అభిషేకాలు చేయడం కాదు. అవసరమైనప్పుడు అంతకు మించి చేయాల్సింది ఉంటుందని యుఎస్ ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు. కంటెంట్ ఫైనల్ కావడంలో జరిగిన ఆలస్యం వల్ల అనుకున్న టైంకి హార్డ్ డిస్కులను థియేటర్లకు చేరవేయడం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు పెద్ద సవాల్ గా మారింది. స్థానికంగా ఉన్న రవాణా వ్యవస్థని పూర్తిగా నమ్మడానికి లేదు. అవి డెలివరీకి గ్యారెంటీ ఇస్తాయి కానీ ఫలానా టైంకి పూర్తి భద్రతతో లాంటి హామీలు ఇవ్వవు. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్ఆర్ఐ అభిమానులే కొరియర్లు గా మారిపోయి డ్రైవ్స్ ని అందజేయడం విశేషం.

ఎట్టి పరిస్థితుల్లో ప్రీమియర్లు మిస్ కాకూడదనే ఉద్దేశంతో రాత్రంతా ఈ డ్రైవ్స్ ని పంపిణి చేయడంలో పలువురు ఫ్యాన్స్ సమయాన్ని, శ్రమని లెక్క చేయకుండా పాల్గొనడం ఇతర అభిమానులను కదిలిస్తోంది. వాటిని క్షేమంగా అందజేశాక మల్టీప్లెక్సుల సిబ్బందితో ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అవుతోంది. ఒకవేళ డ్రైవ్స్ చేరుకోవడం ఏ మాత్రం అటు ఇటు అయినా షోలు క్యాన్సిల్ చేయాల్సిన దారుణమైన పరిస్థితి తలెత్తుతుంది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్ కు తీవ్ర నష్టమే కాక షో చూడాలని ఎగ్జైట్ మెంట్ తో ఉన్న వేలాది అభిమానులకు తీరని మనస్థాపం కలుగుతుంది.

ఈ మొత్తం ఉదంతాన్ని రాబోయే ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్లు ఒక పాఠంగా తీసుకోవాలి. ప్రతిసారి ఇలాంటి సపోర్ట్ దొరక్కపోవచ్చు. కంటెంట్ లేట్ చేస్తే ఓవర్సీస్ లో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో గత కొన్ని నెలలుగా జరిగిన ఉదంతాలు పాఠాలు నేర్పించాయి. విడుదల తేదీని చేరుకునే ఒత్తిడిలో టీమ్ సభ్యులు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా కనీసం వారం రోజుల ముందు ఫైనల్ కాపీతో సహా సర్వం సిద్ధం చేసుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏది ఏమైనా టైంకి ప్రీమియర్లు పడేలా చేయడంలో పవన్ ఫ్యాన్స్ తీసుకున్న చొరవ ఎంతైనా అభినందనీయం.