ఓజీ మేనియా… అప్పుడే హాఫ్ సెంచరీ

పవన్ కళ్యాణ్ స్టార్ పవర్, ఆయన బాక్సాఫీస్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో అరంగేట్రం చేసినప్పటికీ.. కెరీర్లో త్వరగానే తనకంటూ ఒక శైలి తెచ్చుకుని, అప్పటి యూత్‌ను ఉర్రూతూలగించే సినిమాలతో పెద్ద స్టార్ అయిపోయాడు. కెరీర్లో ఏడో సినిమా అయిన ‘ఖుషి’తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని స్టార్ ఇమేజ్, క్రేజ్ పవన్ సొంతం. 

ఐతే రాజకీయాల్లో బిజీ అయి సినిమాల మీద ఫోకస్ తగ్గిపోవడం వల్ల.. తన స్టామినాకు తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల కలెక్షన్ల రికార్డుల్లో పవన్ వెనుకబడిపోయాడు. ఆయన తన శైలికి నప్పే కథతో సినిమా చేస్తే.. దాన్ని ఒక ట్రెండీ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ సినిమా రుజువుగా నిలుస్తోంది. రెండేళ్ల కిందట చిన్న గ్లింప్స్‌తో ఈ సినిమా తెచ్చకున్న హైప్ అసామాన్యం. రిలీజ్ టైంకి హైప్ ఇంకో లెవెల్‌కు చేరుకుంది.

సరిగ్గా ప్రమోషన్లు చేయకపోయినా.. రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగా లేకపోయినా.. ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఓజీ రిలీజవుతున్న ప్రతి చోటా మేనియా కనిపిస్తోంది. యుఎస్‌లో ప్రి సేల్స్‌తోనే 2 మిలియన్ మార్కును దాటేసిందీ చిత్రం. ఇక తెలంగాణ, ఏపీలో బుకింగ్స్ ఆలస్యంగా మొదలైనా సరే.. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. 

విశేషం ఏంటంటే.. రిలీజ్‌కు రెండు రోజుల ముందే ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది. దీన్ని బట్టే ఈ సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డే-1 అన్ని షోలు అయ్యేసరికి ‘ఓజీ’ గ్రాస్ రూ.100 కోట్ల మార్కును దాటితే ఆశ్చర్యమేమీ లేదు. బుధవారమే ఈ సినిమాకు పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్నాయి. నాలుగు రోజుల వీకెండ్ అయ్యేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండే అవకాశముంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఊచకోత మామూలుగా ఉండదు.