అర్జున్ దాస్ దశ తిరుగుతోంది

వయసు చిన్నదే అయినా విలనీ పండించడంలో తనదైన ముద్ర వేస్తున్న అర్జున్ దాస్ చేసింది తక్కువ సినిమాలే. అయినా సరే ప్రేక్షకుల్లో తగినంత గుర్తింపు ఉంది. ముఖ్యంగా అతని బేస్ వాయిస్ కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కల్కి 2898 ఏడి కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ చెప్పించారంటే తన రీచ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓజి టీజర్ లో అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే డైలాగు మారుమ్రోగిపోవడానికి కారణం కూడా ప్రత్యేకంగా అనిపించే గొంతే. ఇమ్రాన్ హష్మీతో పాటు విలన్ గా అర్జున్ దాస్ కూడా ఓజిలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇది పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో విలన్ గా డ్యూయల్ రోల్ చేసి మెప్పించిన అర్జున్ దాస్ కు ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందబోయే డాన్ 3లో విలన్ గా అర్జున్ దాస్ నే సంప్రదించారని ముంబై టాక్. లుక్ టెస్ట్, శాంపిల్ షూట్ చేసి సరిపోతాడనుకుంటే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి లెజెండరీ హీరోలు చేసిన పాత్ర కావడంతో రణ్వీర్ సింగ్ డాన్ 3 కోసం చాలా ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా ప్రారంభం కానప్పటికీ స్క్రిప్ట్ స్టేజిలోనే ఒకటికి పదిసార్లు వడబోత చేస్తున్నారు.

నిజంగా అర్జున్ దాస్ కనక డాన్ 3కి ఎంపికైతే బాలీవుడ్ లో మెల్లగా జెండా పాతేయొచ్చు. అసలే అక్కడ విలన్ల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ డాన్ ఫ్రాంచైజ్ అంటే క్రేజ్ ఖచ్చితంగా ఉంటుంది. మరి అర్జున్ దాస్ కి ఆ అదృష్టం రాసిపెట్టి ఉందో లేదో చూడాలి. తెలుగులో ఆక్సీజన్ తో ఎంట్రీ ఇచ్చిన ఇతను మళ్ళీ బుట్టబొమ్మలోనే కనిపించాడు. రెండూ పెద్దగా ఆడలేదు. తమిళ డబ్బింగులు మాస్టర్, విక్రమ్, ఖైదీ ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఓజి రూపంలో కనక బ్లాక్ బస్టర్ అందుకుంటే ఇక్కడా బిజీ అయిపోవచ్చు. ఆల్రెడీ పలువురు నిర్మాతలు కలిశారట కానీ ఓజి రిజల్ట్ వచ్చాకే చెబుతానని అన్నాడట.