ఏదైనా ఐకానిక్ సినిమా నుంచి కంటెంట్ వాడుకున్నప్పుడు దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలి. ఒరిజినల్ మేకర్స్ నుంచి అనుమతులు తీసుకునే విషయంలో ప్లానింగ్ తో మెలగాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీస్తున్న టైంలో షోలే నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే నిర్మాత బండ్ల గణేష్ వాళ్ళు కోరుకున్న రాయాల్టీ కట్టేసి వివాదం లేకుండా చూసుకున్నారు. అయితే ఇలాంటివి చూసుకోకుండా తొందరపడిన ఒక రియాలిటీ షో నిర్వాహకులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటివి కూడా జరుగుతాయాని ఆశ్చర్యం కలిగించే ఆ సంఘటనేంటో చూడండి.
బాగా పాపులరైన కపిల్ శర్మ కామెడీ షో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న సంగతి తెలిసిందే. జాలీ ఎల్ఎల్బి 3 ప్రమోషన్ల కోసం అక్షయ్ కుమార్ ఈ ప్రోగ్రాంకి గెస్టుగా వచ్చాడు. సరే సందర్భం దొరికింది కదాని ఈవెంట్ డిజైనర్లు హేరాఫేరీలోని పరేష్ రావల్ పోషించిన బాబురావు ఆప్టే పాత్రని ఆర్టిస్ట్ కికు శారదాతో స్పూఫ్ చేయించారు. అచ్చం పరేష్ గుర్తొచ్చేలా నవ్వులు పూయించారు. మెయిన్ ఎపిసోడ్ కన్నా ముందు ప్రోమో వదిలారు. ఇది చూసిన హేరాఫేరీ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భగ్గుమన్నారు. ఒక క్లాసిక్ కి ఆత్మగా నిలిచిన పాత్రని ఇలా అపహాస్యం చేయడం ఏమిటని షో ప్రొడ్యూసర్ల మీద ఫైర్ అయ్యారు.
క్షమాపణ చెప్పి ఆ కంటెంట్ ని అన్ని చోట్లా తీసేయకపోతే 25 కోట్లకు లీగల్ దావా వేస్తానని హెచ్చరించారు. అసలే హేరాఫేరీ 3లో పరేష్ రావల్ నటించడం లేదనే వివాదం ఆ మధ్య బాలీవుడ్ మీడియాని కుదిపేసింది. తర్వాత ఆయనేదో వివరణ ఇచ్చుకున్నారు కానీ కాంట్రావర్సి అలాగే ఉండిపోయింది. సినిమా ఇంకా స్క్రిప్ట్ స్టేజిలో ఉందంటున్నారు కానీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం లేదు. ఫైనల్ గా ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో కానీ అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం చేసి చల్లార్చే ప్రయత్నంలో ఉన్నట్టు ముంబై టాక్. ఇలా స్పూఫ్ లు చేయకూడదంటే మన దగ్గర సుడిగాడు లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చేవా.
Gulte Telugu Telugu Political and Movie News Updates