అధికారంలో ఉండగా కన్నూ మిన్నూ కానరాకుండా వ్యవహరిస్తే.. ప్రభుత్వ నిధులను ఇష్టానుసారం దారి మళ్లిస్తే.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. అధికారంలో ఉన్న వాళ్లకు మద్దతుగా సినిమాలు తీయడం, తద్వారా పరోక్ష ప్రయోజనాలు పొందడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ వైసీపీ అధికారంలో ఉండగా మాత్రం ఎన్నడూ చూడని విడ్డూరాలు చోటు చేసుకున్నాయి. నేరుగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించి సినిమాలు తీయడం ఆ సమయంలోనే జరిగింది.
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాకు, అలాగే మహి.వి.రాఘవ్ రూపొందించిన ‘యాత్ర-2’ సినిమాకు నేరుగా ప్రభుత్వ నిధులను ఉపయోగించిన విషయం వెలుగులోకి రావడం చూసి అందరూ అవాక్కయ్యారు. అంతే కాక సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల మీద విషం చిమ్మే వారి కోసం కార్పొరేషన్లు పెట్టి వారికి జీతాలు చెల్లించిన ఘనత కూడా జగన్ సర్కారుకే చెల్లింది.
ఈ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘యాత్ర-2’ కోసం రూ.2 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆ సినిమా బృందంలోని వారికి పారితోషకాలు, స్టాఫ్‌కు జీతాలు ఇచ్చిన విషయం తాజాగా బయటపడింది. సీఐడీ ఈ వ్యవహారంపై జరిపిన విచారణలో ఈ సంగతి వెలుగు చూసింది. ‘యాత్ర-2’ జగన్ బయోపిక్ అన్న విషయం తెలిసిందే. ‘యాత్ర’ సినిమాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చేపట్టిన పాదయాత్ర మీద నడిపించిన మహి.. ‘యాత్ర-2’లో జగన్‌ను హీరోను చేశారు.
జగన్ సీఎం ఉండగా.. ఆయన ప్రభుత్వ నిధులను వాడుకుని ఈ సినిమా తీసి బహుమతిగా అందించారు. ఐతే ‘యాత్ర’లా.. ‘యాత్ర-2’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జనాల మీద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమా తీసినందుకు స్టూడియో పేరుతో మదనపల్లిలోని హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాల స్థలం తీసుకోవడానికి గత ప్రభుత్వ హయాంలో సిద్ధమయ్యాడు మహి. ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది. కానీ దీని మీద మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ నిధులతో సినిమా తీసినట్లు బయటపడడంతో ఈ వ్యవహారం ఇటు మహి, అటు జగన్ మెడకు చుట్టుకునేలాగే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates