నైంటీస్ దర్శకుడి ‘బ్రాండ్’ బలం

సినీ పరిశ్రమలో అవకాశం దొరకడం ఒకెత్తు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. తొలి అవకాశం కోసం పడే కష్టాలు మామూలుగా ఉండవు. కానీ ఆ ఛాన్స్‌ను సరిగ్గా ఉపయోగించుకుని టాలెంట్ చూపిస్తే రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతాయి. తర్వాత కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తే.. ఇండస్ట్రీనే వారి వెనుక తిరుగుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ.. ఆదిత్య హాసన్. 

‘నైంటీస్ మిడిల్ క్లాస్’ అనే లో బడ్జెట్ వెబ్ సిరీస్‌తో ఇతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందులో పేరున్న కాస్టింగ్ లేదు. చాలా పరిమిత వనరులతో ఆ సిరీస్‌ను పూర్తి చేశాడు. కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్‌ను కాకుండా కంటెంట్‌ను మాత్రమే జనం చూశారు. తెలుగు ఒరిజినల్స్‌లో అదొక సంచలనంగా నిలిచింది. తర్వాత అతను సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘బేబి’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.

ఈలోపు ఆదిత్య హాసన్.. తన అభిరుచిని చాటుతూ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయింది. ఐతే ఈ సినిమా సక్సెస్‌ను ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసే స్థితిలో ఆదిత్య లేడు. యూకేలో ఆనంద్-వైష్ణవి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అతనక్కడ ఉండగానే, సినిమా పూర్తి కాకముందే.. ఇక్కడ డిజిటల్ డీల్ పూర్తయిపోయింది. 

ఏకంగా రూ.11 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ స్థాయి సినిమాకు ఇది చాలా పెద్ద రేటు. బహుశా సినిమా బడ్జెట్ అంతా ఇక్కడే కవరైపోతుండొచ్చు. దర్శకుడిగా నైంటీస్ సిరీస్, నిర్మాతగా లిటిల్ హార్ట్స్ తీసి ఆదిత్య తెచ్చుకున్న గుర్తింపే తన కొత్త చిత్రానికి ఇంత మంచి డీల్ తెచ్చి పెట్టిందనడంలో సందేహం లేదు. ఇంత త్వరగా ఇలాంటి బ్రాండ్ వాల్యూ సంపాదించడం చిన్న విషయం కాదు. దర్శకుడిగా తన తొలి సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. అతను టాలీవుడ్లో మరో మారుతిలా పేరు తెచ్చుకుంటాడేమో.