షాకింగ్ : కల్కి నుంచి దీపికా పదుకునే ఔట్

గత ఏడాది విడుదలై రికార్డుల మోత మ్రోగించిన కల్కి 2898 ఏడి సీక్వెల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఒక పెద్ద బాంబు పేల్చింది. కల్కి కొనసాగింపులో హీరోయిన్ దీపికా పదుకునే ఉండదని, అధికారికంగా ప్రకటిస్తున్నామని, తనతో భాగస్వామ్యం కుదకరపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, కమిట్ మెంట్ ఎక్కువగా కోరుకునే ఇలాంటి పాత్ర కోసం సరైన ప్రత్యాన్మయం చూస్తామని పేర్కొంది. అయితే కారణాలు పేర్కొనలేదు కానీ అంతర్గతంగా ఆమెతో ఏర్పడిన విభేదాలే ఈ కఠిన నిర్ణయానికి ఉసిగొలిపి ఉంటాయని ఫిలిం నగర్ వర్గాల కథనం.

ఆ మధ్య స్పిరిట్ కోసం ముందు దీపికా పదుకునేని తీసుకున్న సందీప్ రెడ్డి వంగా తర్వాత ఆమె డిమాండ్లను భరించలేక త్రిప్తి డిమ్రిని లాక్ చేసుకోవడం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యింది. రెండు వర్గాలు దీని గురించి అధికారికంగా స్పందించకపోయినా ప్రచారమైతే జోరుగా జరిగింది. ఇప్పుడు కల్కి 2898 ఏది నుంచి దీపికాని తప్పించడం వెనుక ఏం జరిగిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అల్లు అర్జున్ – అట్లీ కాంబో మూవీ చేయడం వల్లే దీనికి డేట్లు కేటాయించలేనని చెప్పిందా లేక తెరవెనుక ఇంకేదైనా మతలబు ఉందా అనేది దర్శకుడు నాగ అశ్విన్ బయటికి వచ్చి చెబితే తప్ప ఈ ఇష్యూ గురించి క్లారిటీ రాదు.

ఇదంతా బాగానే ఉంది కథలో కీలకమైన సుమతి పాత్ర ఇప్పుడు ఎవరికి ఇస్తారనేది అసలు చిక్కు. మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లకు ఛాన్స్ లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ ఇందులోనే చిన్న క్యామియో చేసింది కాబట్టి. రష్మిక మందన్న, జాన్వీ కపూర్ లాంటి ఆప్షన్లు చూడొచ్చు. కాకపోతే ప్రభాస్ ఎప్పుడు కల్కి 2 సెట్స్ లోకి అడుగు పెడతాడనేది ముందు చూడాలి. ది రాజా సాబ్ జనవరిలో రిలీజయ్యాక స్పిరిట్ షూట్ ఏకధాటిగా జరగనుంది. ఆలోగానే ఫౌజీకి గుమ్మడికాయ కొట్టొచ్చు. అలా చూసుకుంటే స్క్రిప్ట్ ఎంత సిద్ధంగా ఉన్నా 2027 కన్నా ముందు కల్కి 2 మొదలుపెట్టే ఛాన్స్ దాదాపు లేనట్టే. చూడాలి ఏం చేస్తారో.