ఒక్క మీమ్‌తో ఆ త‌మిళ‌ న‌టుడికి తెలుగులో స్టార్ స్టేట‌స్

వీటీవీ గ‌ణేష్‌.. త‌మిళంలో పాపుల‌ర్ క‌మెడియ‌న్. నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌న గురించి మ‌న వాళ్ల‌కు పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఇప్పుడు తెలుగులో స్టార్ క‌మెడియ‌న్ల‌తో స‌మానంగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే సంక్రాంతికి వ‌స్తున్నాం స‌హా అనేక హిట్ సినిమాల్లో వీటీవీ గ‌ణేష్ న‌టించాడు. ఆయ‌న‌కు తెలుగులో ఇంత డిమాడ్ రావ‌డానికి కార‌ణం బీస్ట్ అనే ఫ్లాప్ మూవీ కావ‌డం విశేషం. ఈ చిత్రంతోనే గ‌ణేష్ సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ‌లేని పాపులారిటీ సంపాదించాడు. మ‌న తెలుగు వాళ్ల‌కు కూడా చేరువ అయిపోయాడు.

త‌న పేరు కూడా తెలియ‌కుండానే మ‌న వాళ్లు ఆయ‌న్ని మీమ్స్ ద్వారా సెల‌బ్రేట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ చిత్ర‌మే.. బీస్ట్. ఈ సినిమాలో ఒక స‌న్నివేశంలో ఎవ‌డ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అంటూ ఒక డైలాగ్ చెబుతాడు వీటీవీ గ‌ణేష్‌. అది పాపుల‌ర్ మీమ్ అయిపోయింది. మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో, వాటిని సంద‌ర్భానుసారంగా వాడ‌డంలో, మీమ్ లాంగ్వేజ్‌లో మాట్లాడ్డంలో తెలుగు వాళ్ల‌కు మించిన వాళ్లు ఎవ్వ‌రూ ఉండ‌రు. బీస్ట్ మూవీలో వీటీవీ గ‌ణేష్ చెప్పిన ఒక్క డైలాగ్‌తో మీమ్స్ మోత మోగిపోయాయి. ఆ పాపులారిటీతోనే తెలుగులో గ‌ణేష్ అవ‌కాశాలు అందుకున్నారు.

తెలుగు వాళ్లు త‌న‌ను ఎంత‌గా ఆద‌రిస్తున్నార‌నే విష‌యాన్ని కిస్ అనే త‌మిళ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో వీటీవీ గ‌ణేష్ పంచుకున్నారు. బీస్ట్‌లో ఆ పాపుల‌ర్ మీమ్ డైలాగ్‌ను స‌తీష్ అనే న‌టుడితో చెబుతాడు గ‌ణేష్‌. అత‌ను కిస్ మూవీలోనూ ఆయ‌న‌తో క‌లిసి నటించాడు. స‌తీష్‌తో తాను చెప్పిన డైలాగ్ తెలుగులో త‌న‌కు ఊహించ‌ని ఫాలోయింగ్ సంపాదించింద‌ని.. ఇప్పుడు పెద్ద పెద్ద తెలుగు స్టార్ల‌తో క‌లిసి ప‌దికి పైగా సినిమాలు చేస్తున్నానంటే ఆ డైలాగే కార‌ణ‌మని.. తెలుగు ఆడియ‌న్స్ త‌న‌ను సొంత వాడిలా చూస్తున్నార‌ని వీటీవీ గ‌ణేష్ పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భఃగా తెలుగు డైరెక్ట‌ర్లు ఎంతో ప్యాష‌నేట్‌గా సినిమాలు తీస్తార‌ని వీటీవీ గణేష్ కొనియాడాడు.