మార్కోలో మితిమీరిన హింసతో బాక్సాఫీస్ వసూళ్లతో పాటు మాస్ లో ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు నరేంద్ర మోడీ బయోపిక్ కి సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలోనూ ప్రధాని జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు కొందరు చేశారు. వాళ్లలో వినయ విధేయ రామ విలన్ వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడు. కానీ అవన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. నిర్మాణ విలువల్లో రాజీ, సరైన సాంకేతిక వర్గం లేకపోవడం, మార్కెటింగ్ లోపాలు తదితర కారణాల వల్ల జనాల నోటీస్ కు రాకుండానే జెండా ఎత్తేశాయి. కానీ ఉన్ని ముకుందన్ చేయబోయే మా వందే అంత ఆషామాషీగా ఉండబోవడం లేదు.
టాప్ టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకున్నారు దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్. కేకే సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, రవి బస్రూర్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాబు సిరిల్ డిజైన్ ఇలా పేర్లు చూస్తుంటే ఏదో ప్యాన్ ఇండియా మూవీ రేంజ్ లో హడావిడి కనిపిస్తోంది. 75 వసంతంలోకి అడుగు పెట్టిన నరేంద్ర మోడీ ప్రస్తుతం వరసగా మూడో పర్యాయం ప్రధాన మంత్రిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని చిరకాలం గుర్తుండిపోయే ఒక బయోపిక్ ఇవ్వాలనే లక్ష్యంతో వంద కోట్లకు పైగా భారీ ఖర్చుకు సిద్ధపడినట్టు ముంబై వర్గాల కథనం.
ఇప్పటిదాకా ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇంత పెద్ద ఎత్తున సినిమాలు తీసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిదని చెప్పొచ్చు. అయితే మార్కోలో కత్తులు గన్నులు పట్టుకుని మనుషులను పిట్టల్లా చంపిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు సిద్ధాంత పరంగా చాణిక్యుడు, వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరొందిన ఒక్క గొప్ప ప్రధానిగా జీవించాలి. ప్రతిపక్షాలు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు. నిజ జీవిత సంఘటనలు, వివాదాలు అన్నీ ఇందులో చూపిస్తారా అంటే థియేటర్లలో సినిమా వచ్చేదాకా చెప్పలేం. ఒకవేళ మా వందే కనక సక్సెస్ అయితే మరికొందరు రాజకీయం నాయకుల కథ స్క్రీన్ పై చూడొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates