సినిమా-వెబ్ సిరీస్.. చిన్నది-పెద్దది.. మన భాష-పర భాష అని తేడా లేదు. తనకు ఏ కంటెంట్ నచ్చినా వెంటనే ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టి మనస్ఫూర్తిగా టీం మొత్తాన్ని అభినందిస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సోషల్ మీడియా జనాలు ఆయన్ని స్టార్ రివ్యూయర్ అని సరదాగా పిలుస్తుంటారు. మహేష్ నుంచి ఒక పోస్ట్ పడిందంటే.. దాన్నొక అవార్డులాగా పీలవుతుంటారు చిన్న సినిమాల మేకర్స్. మహేష్ పెట్టే పోస్టు చిన్న సినిమాలకు ఇచ్చే బూస్టే వేరు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ లిటిల్ హార్ట్స్ టీం కూడా మహేష్ ట్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉంది కొన్ని రోజులుగా.
ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీజిత్ ఎర్రమిల్లి మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ సినిమా చూసి పెద్ద పెద్ద వాళ్లు ఎందరో పోస్టులు పెట్టారని, కాల్స్, మెసేజ్‌లు చేశారని.. ఇదంతా కలలా ఉందని చెబుతూ.. ఇక ఒక్క పోస్టు కోసం తాను ఎదురు చూస్తున్నానంటూ మహేష్ బాబు గురించి ప్రస్తావించాడు. ఆయన కనుక పోస్ట్ పెడితే.. ఇక అంతకంటే తనకు ఏమీ అవసరం లేదని.. వారం రోజులు ఫోన్ ఆఫ్ చేసేసి ఎక్కడికైనా వెళ్లిపోతానని.. పెద్ద పార్టీ ఇస్తానని చెప్పాడు. అతనలా అన్న రెండు రోజులకే మహేష్ బాబు నుంచి పోస్టు వచ్చేసింది.
అందులో ప్రత్యేకంగా శ్రీజిత్ గురించి ప్రస్తావించడమే కాదు.. ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించాడు మహేష్. లిటిల్ హార్ట్స్‌ను ఫన్, ఫ్రెష్ ఫిలిం అని కొనియాడిన మహేష్.. సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా నటించారని పేర్కొన్నాడు. ఈ సినిమా ఒక జాయ్ రైడ్ అని మహేష్ అన్నాడు. చివరగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనిత్‌ను కోట్ చేస్తూ.. బ్రదర్ నువ్వు ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు, నువ్వు రాబోయే రోజుల్లో చాలా బిజీగా ఉంటావు.. కీప్ రాకింగ్ అని మహేష్ తన పోస్టులో పేర్కొన్నాడు.
నిజానికి మహేష్ ప్రస్తుతం ఇండియాలో లేడు. రాజమౌళి సినిమా కోసం ఆఫ్రికాలో షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. శ్రీజిత్ ఇంటర్వ్యూ తన దృష్టికి వచ్చిందేమో.. అంత బిజీలోనూ వీలు చేసుకుని సినిమా చూసి తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ట్వీట్ వేయడం మహేష్ పెద్ద మనసుకు నిదర్శనం.
Gulte Telugu Telugu Political and Movie News Updates