వైట్లతో నితిన్.. నిజం కాదా?

ఓ మంచి సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు నితిన్. 2020లో వచ్చిన ‘భీష్మ’ తర్వాత అతడికి హిట్టే లేదు. దాని తర్వాత అతడి నుంచి అరడజనుకు పైగా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. గత ఏడాది ‘రాబిన్ హుడ్’తో షాక్ తిన్న అతడికి.. ఇటీవల ‘తమ్ముడు’ రూపంలో ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత అతను చేయాల్సిన ‘యల్లమ్మ’ డోలాయమానంలో పడగా.. తనకు ‘ఇష్క్’ మూవీతో పెద్ద బ్రేక్ ఇచ్చిన విక్రమ్ కుమార్‌తో నితిన్ జట్టు కడుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్ మీద నితిన్ ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు. 

ఇంతలోనే సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో నితిన్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబో నితిన్ ఫ్యాన్స్‌తో ఏమంత ఎగ్జైట్మెంట్ కలిగించలేదు. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు నితిన్. అలాంటిది పుష్కర కాలంగా సక్సెస్ రుచి చూడని శ్రీను వైట్లతో రిస్క్ అవసరమా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆల్రెడీ గోపీచంద్.. వైట్లతో ‘విశ్వం’ సినిమా చేసి దెబ్బ తిన్నాడు. మరి నితిన్, వైట్ల కాంబినేషన్ ఏమాత్రం వర్కవుట్ అవుతుందో అన్న సందేహాలు కలిగాయి. 

కానీ ఇప్పుడు.. నితిన్ వైట్లతో జట్టు కట్టట్లేదనే వార్త జోరుగా తిరుగుతుంది. అతను ప్రస్తుతం విక్రమ్ సినిమా మీదే దృష్టిపెట్టినట్లు సమాచారం. ఐతే శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మించనున్న సంగతి మాత్రం వాస్తవం. ఇందులో హీరో ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. యంగ్ రైటర్లను పెట్టుకుని వైట్ల ఈసారి స్ట్రైకింగ్ స్క్రిప్టుతోనే వస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఆయన ఫామ్ చూడకుండా తనతో సినిమా చేయడానికి రెడీ అయ్యే హీరో ఎవరో చూడాలి.