హీరో హీరోయిన్లు అప్‌కమింగ్ ఆర్టిస్టులు. పెద్దగా అనుభవం లేదు. దర్శకుడూ కొత్త వాడే. పెట్టిన బడ్జెట్ కేవలం రెండున్నర కోట్లు. కానీ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఇప్పటికే బడ్జెట్ మీద పది రెట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఇదొకటి. యూట్యూబర్ మౌళిని హీరోగా పరిచయం చేస్తూ, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫేమ్ శివాని నగరం కథానాయికగా కొత్త దర్శకుడైన సాయి మార్తాండ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
మార్తాండ్ మీమ్స్ నేపథ్యం నుంచి రావడం విశేషం. రెండేళ్ల ముందు వరకు కూడా అతను మీమరే. కానీ ఇప్పుడు అతను తీసిన సినిమా ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిస్తోంది. ప్రధాన పాత్రలను అతను మలిచిన విధానం.. సన్నివేశాలను ఎంతో సరదాగా నడిపించిన తీరు.. తన డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
మామూలుగా ప్రేమకథల్లో చూసే తల్లిదండ్రుల పాత్రలకు భిన్నంగా ఇందులో హీరో హీరోయిన్ల పేరెంట్స్ క్యారెక్టర్లు కనిపించాయి. సాధారణంగా హీరో తల్లిదండ్రులు పేదవాళ్లు అయితే.. హీరోయిన్ పేరెంట్స్‌ను రిచ్‌గా చూపిస్తుంటారు. లేదంటే రివర్స్ ఉంటుంది. కానీ ఇందులో ఇద్దరు పేరెంట్స్‌ను ఎగువ మధ్య తరగతికి చెందినట్లు చూపించారు. దీని వల్ల కష్టాలు, కన్నీళ్లకు స్కోప్ లేకపోయింది. ఒకవేళ హీరో లేదా హీరోయిన్ తల్లిదండ్రుల్లో ఎవరినైనా పేదవాళ్లుగా చూపించి ఉంటే ఈ సినిమా ఫ్లాప్ అయ్యేదని ఓ ఇంటర్వ్యూలో సాయి మార్తాండ్ అభిప్రాయపడ్డాడు.
‘‘ఇందులో హీరో హీరోయిన్లు కోచింగ్ సెంటర్‌కు వెళ్తుంటారు. అక్కడ వాళ్ల మధ్య ప్రేమ పుడుతుంది. ఒకవేళ హీరో తల్లిదండ్రులు పేదవాళ్లు అయితే.. అమ్మ అంట్లు తోముకుంటూ, నాన్న కూలికి వెళ్తూ ఉన్నట్లయితే.. వాళ్ల కొడుకు చేసే పనులకు మనకు చిర్రెత్తుకొస్తుంది. మా అమ్మే కనుక అలాంటి సన్నివేశాలు చూస్తే.. నన్ను కొడుతుంది. అమ్మా నాన్న కష్టపడుతుంటే వీడు చేసే పనులేంట్రా అంటుంది. ప్రేక్షకులందరూ కూడా అలాగే రియాక్ట్ అవుతారు. సినిమా ఆడేది కాదు. పేరెంట్స్ కూడా రిచ్ కాబట్టే వాడు ఏం చేసినా చెల్లింది. సినిమాను సరదాగా తీసుకున్నారు’’ అని సాయిమార్తాండ్ విశ్లేషించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates