లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మందు కొట్టి చేసిన విన్యాసాల గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక స్టేజ్ మీద చెబితే ఎలా ఉంటుంది? శనివారం ఇళయరాజా 50 ఏళ్ల సినీ వేడుకలో ఇదే జరిగింది. ఇళయరాజా, తాను, దర్శకుడు మహేంద్రన్ కలిసి ఒక సందర్భంలో మందు పార్టీలో కూర్చున్న విషయం గురించి రజినీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ముందుగా ఇళయరాజా మాట్లాడుతూ.. ఈ వేడుక గురించి రజినీ రెండు రోజుల కిందట తనతో మాట్లాడుతూ.. తన గురించి జనాలకు తెలియని చాలా విషయాలు చెప్పబోతున్నట్లు తనతో అన్నాడని.. అందులో తాను మందు కొట్టిన విషయం కూడా ఉంటుందని హెచ్చరించాడని ఇళయరాజా అన్నారు. రజినీ వైపు చూస్తూ నువ్వు ఏం అన్నావో చెప్పమంటావా అని అడగ్గా.. తమిళనాడు సీఎం స్టాలిన్ పక్కన కూర్చున్న రజినీ ఊకొట్టాడు. తర్వాత ఆయనే మైక్ దగ్గరికి వచ్చి ఆ పార్టీ గురించి మొత్తం వివరించి చెప్పారు.
మహేంద్రన్ దర్శకత్వంలో రజినీ జానీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో తాను, మహేంద్రన్ మందు కొట్టడానికి రెడీ అయ్యామని.. అదే సమయంలో ఇళయరాజాను అడిగితే, తనకూ మందు తీసుకురావాలని అన్నాడని రజినీ గుర్తు చేసుకున్నారు. ఐతే ఇళయరాజా ఆ రోజు కేవలం అర బీరు మాత్రమే తాగాడని.. ఆ మాత్రం తాగి ఆయన ఆడిన ఆట అలాంటిలాంటిది కాదని రజినీ అనడంతో ఆడిటోరియంలో అందరూ గొల్లుమన్నారు. ఊర్లో ఉన్న అన్ని గాసిప్పుల గురించి ఇళయరాజా ఆ రోజు అడిగాడని.. హీరోయిన్ల గురించి కూడా చాలా మాట్లాడాడని.. వాటి నుంచే ఆయన పాటలన్నీ వచ్చాయని అంటూ రజినీ నవ్వేశారు.
రజినీ ఇలా మాట్లాడుతున్నంతసేపు పక్కనే ఉన్న ఇళయరాజా.. అదంతా అబద్ధం అన్నట్లుగా చేయి ఊపుతూ కనిపించడం విశేషం. రజినీ, ఇళయరాజా మధ్య ఎంత అనుబంధం ఉందో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్ సైతం పాల్గొన్నారు. మరోవైపు రజినీ ప్రసంగిస్తూ.. 90వ దశకంలో ఇళయరాజాకు అవకాశాలు తగ్గి తనతో సహా అందరూ ఏఆర్ రెహమాన్ వైపు వెళ్లిన సమయంలోనూ ఆయన ఏమాత్రం ఫీల్ కాలేదని.. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోయారని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates