బ్యూటీ మీద అంత నమ్మకమా బేబీ

చిన్న సినిమాల్లో పెద్ద సెన్సేషన్ గా నిలిచిన బేబీ టీమ్ లోని భాగస్వాములు నిర్మాత మారుతీ, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ చేయి కలిపిన మరో మూవీ బ్యూటీ సెప్టెంబర్ 19 విడుదలకు రెడీ అవుతోంది. ఇది కూడా బేబీ, లిటిల్ హార్ట్స్ తరహాలో ఇంటర్ వయసు ప్రేమకథే. కాకపోతే తండ్రి సెంటిమెంట్ బలంగా దట్టించి కాసింత క్రైమ్, థ్రిల్స్ జోడించారు. అంకిత్ కొయ్య, నిలకి పత్ర జంటగా నటిస్తుండగా నరేష్, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోల్డ్ కంటెంట్ కాకుండా ఈసారి సీరియస్ సబ్జెక్టు ఎంచుకున్నారు. జెఎస్ఎస్ వర్ధన్ దర్శకుడిగా ఈ బ్యూటీ ద్వారా పరిచయం కాబోతున్నారు.

ట్రైలర్ వచ్చింది. చూస్తుంటే ఆసక్తి రేపేలానే ఉంది. కాకపోతే ప్రమోషన్ పరంగా పెద్దగా హడావిడి చేయడం లేదు. మారుతీ బ్రాండ్ ని హైలైట్ చేయడం లేదు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ మరోసారి వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. కానీ ఇవేవీ వాడుకోవడం లేదు. అసలు ట్విస్టు ఏంటంటే తల మీద ఓజిని పెట్టుకుని కేవలం వారం ముందు ఈ బ్యూటీని దింపడం. అసలే మిరాయ్ ఒకపక్క ర్యాంపేజ్ ఆడుతోంది. దాని తాకిడి రెండో వారంలోనూ ఉంటుంది. మరి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా అంత తక్కువ స్పాన్ పెట్టుకుని బ్యూటీని రిలీజ్ చేయనుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. బహుశా నాన్ థియేట్రికల్ డీల్ ఏదైనా ఉందేమో.

యూత్ కి కనెక్ట్ అయితే చాలు ఇలాంటి బ్యూటీలు బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయిపోతున్నాయి. వారం ఆడినా చాలు బడ్జెట్ రికవర్ అయిపోయి లాభాలు వచ్చేస్తాయి. లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఓవర్ ఫ్లోస్ ఎంజాయ్ చేస్తోంది. కానీ బ్యూటీలో సీరియస్ పాయింట్స్ టచ్ చేశారు కాబట్టి మరీ ఆ స్థాయిలో రెస్పాన్స్ కాదు కానీ బేబీ తరహాలో సంచలనం అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. ఎస్కెఎన్, సాయి రాజేష్ లు పార్ట్ నర్స్ కాకపోవడం వల్ల సోషల్ మీడియా హడావిడి తక్కువగా ఉందేమో కానీ పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు రాబట్టుకోవచ్చు. విజయ్ ఆంటోనీ భద్రకాళి తప్ప ఆ రోజు పెద్దగా చెప్పుకునే కాంపిటీషన్ లేదు.