లిటిల్ హార్ట్స్ సినిమాతో టాలీవుడ్లో సంచలనం రేపుతున్నాడు యువ దర్శకుడు సాయి మార్తాండ్. దర్శకుడిగా అతడికిదే తొలి చిత్రం. సింపుల్ కథను తీసుకుని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యువ ప్రేక్షకులు అతడి నరేషన్‌కు ఫిదా అయిపోయారు. సాయి మార్తాండ్ కొన్నేళ్ల ముందు మీమర్ కావడం విశేషం.
మీమ్స్ అనుభవం సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ కామెడీ పండించడంలో బాగా ఉపయోగపడింది. సోషల్ మీడియాను ఉపయోగించుకునే అతను ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కోవడానికి కూడా తనకు సోషల్ మీడియానే సాయపడిందని అతను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఫ్యాన్ వార్స్‌ను సైతం తాను కెరీర్ కోసం ఉపయోగించుకున్నట్లు సాయి మార్తాండ్ వెల్లడించాడు.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అయిన పొన్నియన్ సెల్వన్ తమిళంలో బాగా ఆడినా, తెలుగులో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమాను ఇష్టపడేవాళ్లు, నచ్చని వాళ్లు రెండు వర్గాలుగా తయారయ్యారని.. వీళ్ల మధ్య ఫ్యాన్ వార్స్ జరిగేవని… హేటర్స్ బ్యాచ్‌లో తాను కూడా ఒకడినని సాయి మార్తాండ్ వెల్లడించాడు.
బాహుబలి నచ్చి, పొన్నియన్ సెల్వన్‌ను ఇష్టపడని వాళ్లు ఆ గ్రూప్‌లో ఉంటారని.. దీన్నుంచే తాను ఇండస్ట్రీలో అనేకమంది కాంటాక్ట్స్ సంపాదించానని మార్తాండ్ తెలిపాడు. ఈ గ్రూప్‌లో వాళ్లు చేపట్టిన ఒక స్పేస్‌కు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన మార్కెటింగ్ హెడ్ ఒకసారి వచ్చారని.. ఆ స్పేస్‌లో ఓ వ్యక్తి తన గురించి చాలా పాజిటివ్‌గా చెప్పడంతో ఆ మార్కెటింగ్ హెడ్ ద్వారా ప్రొడక్షన్ హౌస్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ను కలిసే అవకాశం లభించిందని మార్తాండ్ తెలిపాడు. ఇలా సోషల్ మీడియాను తన కెరీర్ కోసం బాగానే ఉపయోగించుకున్నానని.. దాని వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని సాయి మార్తాండ్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates