ఆడితే గొప్పన్నారు… రికార్డులు బ్రేక్ చేస్తోంది

సూపర్ హీరో సినిమా అనగానే లీడ్ రోల్‌లో ఒక హీరో ఉండాలనే కోరుకుంటారు ప్రేక్షకులు. ఫిలిం మేకర్స్ కూడా హీరోలను అలాంటి అవతారాల్లో చూపిస్తేనే బాక్సాఫీస్ దగ్గర కాసులు రాలతాయని భావిస్తారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌లతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు రావడం హాలీవుడ్లో కూడా తక్కువే. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఇలాంటి సినిమాలే లేవు. కానీ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే మలయాళ సినీ పరిశ్రమ మాత్రం ఈ సాహసం చేసింది. 

లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ తనయురాలు, పెద్దగా స్టార్ ఇమేజ్ సంపాదించని కళ్యాణిని లీడ్ రోల్‌లో పెట్టి రూ.30 కోట్ల బడ్జెట్లో ‘లోకా’ సినిమా తీశారు. డొమినిక్ అరుణ్ అనే దర్శకుడు ఈ కథతో సినిమా తీయాలని చాలామంది నిర్మాతలను కలిసి ఎవ్వరూ ఓకే చెప్పక ఇబ్బంది పడుతున్న సమయంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. 

ఐతే ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా సూపర్ హీరో సినిమాలో హీరోయిన్ ప్రధాన పాత్ర చేయడమేంటి.. అయినా దాని మీద రూ.30 కోట్ల బడ్జెట్టా అని ఆశ్చర్యపోయారు. మలయాళ ఇండస్ట్రీ స్థాయికి అది చాలా పెద్ద బడ్జెట్. ఈ సినిమా వర్కవుట్ కావడం చాలా కష్టమనే అనుకున్నారు చాలామంది. కానీ రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి అనూహ్యమైన హైప్ వచ్చింది. రిలీజ్ తర్వాత ఆ హైప్‌‌ను మించి వసూళ్లు రాబట్టింది. ముందు వంద కోట్ల గ్రాస్ వసూళ్లతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సౌత్ ఇండియా రికార్డును బద్దలు కొట్టిందీ చిత్రం. 

ఇప్పుడేమో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్బులోకి కూడా అడుగుపెట్టేసింది లోకా. ఇండియా మొత్తంలో ఇప్పటిదాకా ఏ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ ఘనతను అందుకోలేదు. ప్రస్తుతం ‘లోకా’ మలయాళంలో నాలుగో హైయెస్ట్ గ్రాసర్‌‌గా ఉంది. రూ.268 కోట్లతో మోహన్ లాల్ సినిమా ‘ఎంపురాన్’ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇంకో రెండు మూడు వారాలు ‘లోకా’ నిలబడితే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టి సంచలనం రేపడం ఖాయం.