చిరు-పూరి.. అలా కుదరలేదు ఇలా కలిశారు

టాలీవుడ్లో గత మూణ్నాలుగు దశాబ్దాల్లో దర్శకుడిగా మారిన ప్రతి వ్యక్తీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆశ పడి ఉంటాడు. కానీ ఆ అవకాశం అందరికీ రాదు. స్టార్ స్టేటస్ సంపాదించాక ప్రతి డైరెక్టర్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించిన వాడే. అందులో పూరి జగన్నాథ్ కూడా ఉన్నాడు. పూరి కెరీర్ పీక్స్‌కు చేరుకుంటున్న సమయంలోనే చిరు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మెగాస్టార్ రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు సినిమా చేయడానికి ఆయన గట్టిగా పరిశీలించిన పేర్లలో పూరిది కూడా ఉంది.

‘ఆటో జానీ’ పేరుతో ఒక కథ రెడీ చేసి కొన్ని నెలల పాటు చిరుతో ట్రావెల్ చేశాడు పూరి. కానీ సెకండాఫ్ విషయంలో చిరు సంతృప్తి చెందక ఆ సినిమా ముందుకు కదల్లేదు. తర్వాత చిరు, పూరి దారులు వేరైపోయాయి. పూరి బాగా డౌన్ అయిపోవడంతో మళ్లీ చిరుతో సినిమా చేయడం సందేహంగానే కనిపిస్తోంది. కానీ మధ్యలో చిరు హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’లో ఒక చిన్న వేషం వేయడం ద్వారా చిరుతో కలిసి పని చేయాలనే ముచ్చటను ఏదో రకంగా తీర్చుకున్నారు పూరి.

ఐతే పూరి దర్శకుడిగా, చిరు హీరోగా సినిమా మాత్రం సాధ్యపడలేదు. అలా సెట్స్‌లో కలవలేకపోయిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు కాస్త భిన్నమైన పరిస్థితుల్లో ఓ సెట్లో ఫొటోలకు పోజులు ఇచ్చారు. చిరు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్’, మరోవైపు విజయ్ సేతుపతితో పూరి తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ ఒకే చోట జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిరునే పూరి సినిమా సెట్స్‌కు వచ్చారు. ఆయన వెంట దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ నయనతార తదితరులు కూడా ఉన్నారు.

పూరి సినిమా సెట్స్‌లో సేతుపతి, టబు, నిర్మాత ఛార్మి కౌర్ లాంటి వాళ్లున్నారు. అంతా కలిసి ఫొటోకు పోజు ఇచ్చారు. ఆర్టిస్టులందరూ కూడా తమ సినిమాకు సంబంధించిన గెటప్స్‌లోనే కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు, పూరి ఇలా కలవడం బాగానే ఉంది కానీ.. సేతుపతితో చేస్తున్న సినిమాతో హిట్టు కొట్టి ఒకప్పటి స్థాయిలో ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేసి చిరుతో పూరి సినిమా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్న అభిమానులు చాలామందే ఉన్నారు.