అనుకున్నదే అవుతోంది. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎందరో ఫిలిం మేకర్స్ ని యానిమేషన్ వైపుకు తీసుకెళ్తుందన్న అంచనా చాలా త్వరగా నిజమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఆంజనేయుడి కథను వాయుపుత్ర పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. వచ్చే సంవత్సరం దసరా విడుదలను టార్గెట్ చేసుకున్న ఈ మూవీలో ప్రత్యేకంగా నటీనటులు ఉండరు. అన్నీ యానిమేటెడ్ క్యారెక్టర్లతోనే కథను నడిపిస్తారు. నాగచైతన్య తండేల్ తో హిట్టు కొట్టాక గ్యాప్ తీసుకున్న చందూ మొండేటి ఈ వాయుపుత్రకు దర్శకుడు. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు.
అందరికీ తెలిసిన కథే కాబట్టి ఎమోషన్స్, ఎలివేషన్స్ జోడించి వాయుపుత్రని ఎలా చూపిస్తారనేది కీలకం కానుంది. ఇప్పుడిలాంటి ప్రయత్నాల్లోనే ఇతర ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయని సమాచారం. మీడియం రేంజ్ హీరోల మీద వంద కోట్లు పెట్టి జూదం ఆడటం కన్నా ఇలా యానిమేషన్ల మీద తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వచ్చేలా చేసుకోవచ్చనే సత్యం ప్రొడ్యూసర్లు గుర్తిస్తున్నారు. అయితే యానిమేషన్ లో తీసినంత మాత్రాన జనం నెత్తిన బెట్టుకుంటారనే గ్యారెంటీ లేదు. వాళ్ళను రెండున్నర గంటల పాటు కట్టిపడేసే కంటెంట్ ని ఇవ్వాలి. అప్పుడే మహావతార్ నరసింహ లాంటివి సాధ్యమవుతాయి.
చిన్నగా మొదలైన ఈ మార్పు క్రమంగా ట్రెండ్ లా మారినా ఆశ్చర్యపోనక్కలేదు. ఆర్టిస్టులను పెట్టుకుని అష్టకష్టాలు పడే కంటే ఇలా యానిమేషన్ టీమ్ ని సెట్ చేసుకుని సినిమాలు తీయొచ్చని నిర్మాతలు భావించే అవకాశాలు లేకపోలేదు. అయితే అవి మహావతార్ నరసింహను మించి ఉండాలి. అలాని రెగ్యులర్ గా వీటినే తీస్తూ పోయినా రిస్కె. ఎందుకంటే రియల్ లైఫ్ ఆర్టిస్టులను తెరమీద చూస్తే వచ్చే ఫీల్ వేరు. ప్రతిసారి యానిమేషన్ తో ఆ భావోద్వేగాన్ని రిజిస్టర్ చేయలేం. ఒకదశ దాటాక ఇవీ రొటీన్ అయిపోయే ప్రమాదం ఉంది. మరి వాయుపుత్ర లార్జర్ దాన్ లైఫ్ రేంజ్ లో అద్భుతం చేస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates