‘డీజే టిల్లు’తో మెరిసి మాయమై.. మళ్లీ ఇన్నాళ్లకు

ఒక పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడికి.. తర్వాత అవకాశాల విషయంలో అసలే ఇబ్బందీ ఉండదు. కానీ పెట్టుబడి మీద ఐదారు రెట్లు లాభం తెచ్చి పెట్టిన ‘డీజే టిల్లు’ సినిమాను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సినిమా క్రెడిట్ మొత్తం హీరో కమ్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలోకి వెళ్లిపోవడంతో విమల్ కెరీర్ ముందుకు సాగలేదు. ‘డీజే టిల్లు’ సీక్వెల్ తీయాలనుకున్నపుడు విమల్ పక్కకు వెళ్లిపోయాడు. అతడి స్థానంలోకి మల్లిక్ రామ్ వచ్చాడు.

‘టిల్లు స్క్వేర్’ను ఎందుకు డైరెక్ట్ చేయట్లేదంటే తనకు వేరే కమిట్మెంట్లు ఉన్నట్లు చెప్పాడు విమల్. కానీ ‘డీజే టిల్లు’ వచ్చిన మూడేళ్ల వరకు విమల్ మరో సినిమా మొదలుపెట్టలేకపోయాడు. ఐతే ఎట్టకేలకు అతను కొత్త సినిమాను ప్రారంభించాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి లీడ్ రోల్‌‌లో నటించిన ‘సివరపల్లి’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించిన రాగ్ మయుర్.. విమల్ కృష్ణ కొత్త సినిమాలో హీరోగా చేస్తున్నాడు.

ఇటీవల ‘పరదా’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌కు జోడీగా నటించిన రాగ్ మయూర్‌ను విమల్ ఒక ఫీచర్ ఫిలింలో ఫుల్ లెంగ్త్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు. అల్లరి నరేష్‌తో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా తీసిన చిలక ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. థ్రిల్లర్ చిత్రాలతో మంచి పేరు సంపాదించిన శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ‘డీజే టిల్లు’తో హిట్టు కొట్టినా క్రెడిట్ రాని నేపథ్యంలో.. విమల్ తన ఒరిజినల్ టాలెంట్ ఏంటో ఈ సినిమాతో చూపించాల్సి ఉంది. రాగ్ మయూర్ లాంటి అప్‌కమింగ్ ఆర్టిస్టును లీడ్ రోల్‌లో పెట్టి హిట్టు కొడితే రావాల్సిన పేరంతా వస్తుందనడంలో సందేహం లేదు.