మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టి.. అనతి కాలంలోనే తనకంటూ సొంతంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తిరుగులేని స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్. తొలి రెండు మూడు చిత్రాల వరకు అన్నయ్య నీడలో ఉన్న పవన్.. ‘తొలి ప్రేమ’ నుంచి పంథా మార్చేశాడు. టాప్ స్టార్లలో ఒకడయ్యాడు. ఐతే అరంగేట్రానికి ముందు పవన్‌కు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదనే విషయాన్ని చిరు సహా చాలామంది చెబుతూనే ఉంటారు. పవన్ సైతం ఆ విషయాన్ని అనేక సందర్బాల్లో వెల్లడించాడు. అలాంటి సమయంలో పవన్ వదిన సురేఖ.. అతను హీరో అయ్యే దిశగా ఎంతో ప్రోత్సహించినట్లు కూడా చెబుతుంటారు. ఆమెతో పాటు పవన్ హీరో కావడం వెనుక ఎవ్వరికీ తెలియని మరో వ్యక్తి కూడా ఉన్నారట. ఆ వ్యక్తే తన తల్లి కనకరత్నమ్మ అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు అల్లు అరవింద్.
ఇటీవలే కనకరత్నమ్మ పరమపదించిన సంగతి తెలిసిందే. ఆమె పెద్ద కర్మను హైదరాబాద్‌లో పెద్ద స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సైతం హాజరై కనకరత్నమ్మకు నివాళులర్పించారు. అల్లు కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌కు తన తల్లి అందించిన ప్రోత్సాహం గురించి వెల్లడించారు.
కళ్యాణ్‌ను తన తల్లి ప్రేమగా ‘కళ్యాణి’ అని పిలిచేదని ఆయన చెప్పారు. పవన్‌ను చూసి ఎంతో అందంగా ఉన్నావు, సినిమాల్లో ఎందుకు ట్రై చేయవు అంటూ పదే పదే అడిగేదని అరవింద్ వెల్లడించారు. బాగా సిగ్గరి అయిన కళ్యాణ్ అది తన వల్ల కాదని అనేవాడని.. ఐతే తనను కూడా పిలిచి, ఇంత అందంగా ఉన్నాడు, ఇతణ్ని హీరోను చేయొచ్చు కదా అని చెప్పేదని.. ఆ రకంగా పవన్ కళ్యాణ్‌ను ప్రోత్సహించి హీరోను చేయడం వెనుక తన తల్లి పాత్ర ఉందని.. ఈ విషయాన్ని కళ్యాణ్ సైతం ఓ సందర్భంగా మీడియాతో పంచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates