తేజ సజ్జను అలా అవమానించిందెవరు?

‘హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు తేజ సజ్జ. ఆ సినిమాకు ముందు హీరోగా తనేమంత పాపులర్ కాదు. బాల నటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. ఓ బేబీ, జాంబి రెడ్డి సినిమాలతో తనకు వచ్చిన గుర్తింపు తక్కువే. కానీ ‘హనుమాన్’తో తన కెరీర్ మారిపోయింది. అలా అని అంతకుముందు అతను కెరీర్లో ఇబ్బందులు పడకుండా ఏమీ లేదు. హీరో కావాలనుకున్నపుడు అవకాశాల కోసం అతనూ దర్శక నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక పెద్ద దర్శకుడు తనను ఎలా ఆశ చూపి ఎలా దెబ్బ కొట్టాడో ‘మిరాయ్’కి సంబంధించిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు తేజ.

తాను హీరో అవ్వాలనుకున్నపుడు ఎన్నో కష్టాలు పడ్డానని.. మోసాలు, రిజెక్షన్లు, అవమానాలు అన్నీ చూశానని తేజ తెలిపాడు. తనను మోసం చేసిన వాళ్లలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారని అతనన్నాడు. ఒక స్టార్ డైరెక్టర్ తనకు కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టాడని.. 15 రోజులు షూటింగ్ కూడా చేశాడని.. కానీ ఒక రోజు హఠాత్తుగా సెట్స్‌కు ఇంకో హీరో వచ్చాడని.. ఆ సినిమాలో అతనే హీరో అని అప్పుడు తనకు అర్థమైందని తేజ వెల్లడించాడు. తన కంటే ముందు ఆ హీరోకు కథ చెప్పిన ఆ దర్శకుడు.. తనకు సీన్స్ చూపించడం కోసం తనతో మాక్ షూట్ చేశాడని తర్వాత తెలిసిందని తేజ బాధాకరమైన విషయాన్ని బయటపెట్టాడు.

ఇది ఎలాంటి వ్యక్తికైనా ఎంతో బాధ కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. ఓ వర్ధమాన నటుడితో మరీ అంత దుర్మార్గంగా వ్యవహరించిన ఆ దర్శకుడు ఎవరో మరి? ఇక బాల నటుడిగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల హీరో అవుతానంటే ఇంట్లో వాళ్లు భయపడ్డారని తేజ తెలిపాడు. ‘చూడాలని ఉంది’లో బాల నటుడి కోసం చిరు దగ్గరికి చాలా ఫొటోలు వచ్చాయని.. ఆయన తన ఫొటోనే సెలక్ట్ చేశారని.. ఆయన ఆ రోజు అలా చేసి ఉండకపోతే తాను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదని తేజ అన్నాడు.