అర్ధ‌రాత్రి చ‌ర‌ణ్ ప్రాంక్ కాల్.. ఎవ‌రికి?

తేజ స‌జ్జ‌.. హ‌నుమాన్ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించిన యువ క‌థానాయ‌కుడు. త‌న కొత్త చిత్రం మిరాయ్ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ‌వుతోంది. మిడ్ రేంజ్ స్టార్ల‌కు పోటీ ఇచ్చే స్థాయికి వ‌చ్చేశాడత‌ను. ఈ సినిమా కూడా హ‌నుమాన్ లాగా పెద్ద హిట్ట‌యితే అత‌డి లెవెలే మారిపోతుంది. ఐతే తేజ‌కు టాలీవుడ్లో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేక‌పోవ‌చ్చు కానీ.. బాల న‌టుడిగా అత‌డికున్న గుర్తింపే పెద్ద బ్యాగ్రౌండ్. చూడాల‌ని ఉంది, ఇంద్ర స‌హా బాల న‌టుడిగా 50 దాకా సినిమాలు చేశాడ‌త‌ను.

ఓ బేబీ చిత్రంతో అత‌ను రీఎంట్రీ ఇచ్చాడు. అందులో అత‌ను హీరో కాదు. త‌న‌ది క్యారెక్ట‌ర్ రోల్. త‌ర్వాత జాంబి రెడ్డితో హీరో అయ్యాడు. అది ఓ మోస్త‌రుగా ఆడింది. హ‌నుమాన్ త‌న కెరీర్‌ను మార్చేసింది. బాల న‌టుడిగా ఎన్నో సినిమాల్లో న‌టించ‌డంతో చిరంజీవి స‌హా పెద్ద పెద్ద స్టార్ల‌తో అత‌డికి మంచి ప‌రిచ‌యం ఉంది. అంద‌రిలోకి చిరుతోనే అత‌డికి మంచి అనుబంధం ఉంది. చిరు త‌న‌ను ఒక కొడుకులా చూస్తాడ‌ని గ‌తంలోనే చెప్పాడు తేజ‌. చిరునే కాక ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ సైతం త‌న ప‌ట్ల ఎంత ప్రేమ‌గా ఉంటాడో ఒక ఇంట‌ర్వ్యూలో తేజ వెల్ల‌డించాడు.

తాను, చ‌ర‌ణ్ బ‌య‌ట ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ క‌లిసి క‌నిపించ‌లేదు కానీ.. త‌మ మ‌ధ్య గొప్ప బాండింగ్ ఉంద‌ని తేజ తెలిపాడు. త‌నతో చ‌ర‌ణ్ చాలా ప్రేమ‌గా మాట్లాడ‌తాడ‌ని అత‌న‌న్నాడు. చ‌ర‌ణ్ త‌న‌కు ఎంత క్లోజో అత‌ను ఒక ఉదాహ‌ర‌ణ చెప్పాడు. హ‌నుమాన్ సినిమా త‌ర్వాత తాను ఒక షూటింగ్‌లో భాగంగా ఒక చోట ఉన్నాన‌ని.. ఆ రోజు రాత్రి పడుకుని ఉంటే అర్ధ‌రాత్రి 12.30 ప్రాంతంలో త‌న‌కు ఒక కాల్ వ‌చ్చింద‌ని.. ఒక వ్య‌క్తి మీదో ఒక‌రు మాట్లాడ‌తారంటూ ఫోన్ ఇచ్చాడ‌ని.. చ‌ర‌ణే ఆ ప్రాంక్ కాల్ చేశాడ‌ని తేజ వెల్ల‌డించాడు.

బాల న‌టుడిగా మొద‌లుపెట్టి.. ఇప్పుడు హ‌నుమాన్ లాంటి సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించ‌డం గురించి చ‌ర‌ణ్ ప్ర‌స్తావిస్తూ.. త‌న స‌క్సెస్ విష‌యంలో ఎంతో సంతోషం వ్య‌క్తం చేశాడ‌ని.. అది త‌న‌కు గొప్ప ఫీలింగ్ ఇచ్చింద‌ని తేజ తెలిపాడు. చ‌ర‌ణ్ బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించే వ్య‌క్తి కాద‌ని.. త‌న ప‌నిలో తాను ఉన్నాన‌ని.. కాబ‌ట్టి ఇద్ద‌రం ఇప్ప‌టిదాకా ఎక్క‌డా క‌లిసి మీడియాకు క‌నిపించ‌లేదు కానీ.. త‌న‌తో చ‌ర‌ణ్ చాలా క్లోజ్‌గా ఉంటాడంటూ ఈ ఉదాహ‌ర‌ణ చెప్పాడు తేజ‌. ఇక హీరో కావాల‌నుకున్నపుడు చిరంజీవిని వెళ్లి క‌లిస్తే.. ఇప్పుడున్న హీరోలు చేస్తున్న‌ది కాకుండా నువ్వు డిఫ‌రెంట్‌గా ఏం చేయ‌గ‌ల‌వో ఆలోచించుకుని అది చెయ్య‌మ‌ని చిరు స‌ల‌హా ఇచ్చార‌ని.. ఆ మాట‌నే ఫాలో అవుతున్నాన‌ని తేజ చెప్పాడు.