అఫీషియల్ – రజనీకాంత్ + కమల్ హాసన్

46 సంవత్సరాలుగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న కలయిక ఎట్టకేలకు సాధ్యమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ రూపొందబోతోందనే ప్రచారం కూలీ రిలీజైన మొదటి వారంలోనే జరిగింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీన్ని హ్యాండిల్ చేస్తారని, పెద్ద బడ్జెట్ తో బడా ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కిస్తుందని అందులో చెప్పుకొచ్చారు. అయితే అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా పోయింది. 1979 అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత ఇద్దరు కలిసి నటించలేదు. 80 దశకం నుంచి స్టార్ డం అమాంతం పెరిగిపోవడంతో ఈ కాంబోని కలపడం ఎవరి వల్ల కాలేదు.

ఇన్నేళ్ల తర్వాత ఏడు పదుల వయసులో ఇద్దరూ దాన్ని చేసి చూపించబోతున్నారు. దుబాయ్ లో జరుగుతున్న సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ స్వయంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. ఇప్పటిదాకా తమ మధ్య పోటీని మీరు అంటే జనం సృష్టించారు తప్ప రజినితో తనకు ఎలాంటి పొరపొచ్చాలు లేవని, త్వరలోనే చేతులు కలపబోతున్నామని అన్నారు. నిర్మాణ సంస్థ, దర్శకుడు లాంటి వివరాలేవీ చెప్పలేదు కానీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతి త్వరలోనే శ్రీకారం చుట్టడం ఖాయమని తెలుస్తోంది. చెన్నై టాక్ ప్రకారం దసరాకు ప్రకటన ఇచ్చి నవంబర్ లోపు షూటింగ్ మొదలు పెట్టొచ్చట.

కార్తీతో ప్లాన్ చేసుకున్న ఖైదీ 2ని ఈ కారణంగానే లోకేష్ కనగరాజ్ పక్కన పెట్టాడు. అమీర్ ఖాన్ తో ఓకే చేసుకున్న సూపర్ హీరో కథకు ఇంకొంచెం ఎక్కువ టైం అవసరం పడటంతో ఈ గ్యాప్ లో కమల్, రజని మూవీని పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మాణిక్ బాషా, వీరయ్య నాయుడు వయసయ్యాక తిరిగి తమ పాత జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తనను ఎప్పటి నుంచో వెంటాడుతోందని లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అవే పాత్రలను యధాతథంగా తీసుకోకపోయినా ఇద్దరు ఏజ్ బార్ గ్యాంగ్ స్టర్స్ తో పవర్ ఫుల్ స్క్రిప్ట్ అయితే సిద్ధం చేస్తారట. మరి దీన్ని ఎప్పుడు మొదలుపెట్టి సస్పెన్స్ కు శుభం కార్డు వేస్తారో.