జపాన్ సినిమాకు ఇండియాలో క్రేజ్ ఏంటయ్యా

మన దేశంలో హాలీవుడ్ మూవీస్ విరగబడి ఆడతాయి కానీ జపాన్ సినిమాలు థియేటర్లలో పెర్ఫార్మ్ చేసిన దాఖలాలు లేవు. అందులోనూ యానిమేషన్ అంటే అస్సలు ఛాన్స్ లేదు. కానీ సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ ఈ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టేలా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికీ లక్షకు పైగా టికెట్లు అమ్మేయగా సుమారు అయిదు కోట్లకు పైగా గ్రాస్ నమోదయ్యింది. రిలీజ్ డేట్ వచ్చేలోగా ఎంత లేదన్నా పదిహేను కోట్లు ముందస్తుగా వచ్చి పడతాయని ఒక అంచనా. హైదరాబాద్ లో టికెట్లు పెట్టడం ఆలస్యం హాట్ కేక్స్ లా నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయి.

మనకు ఇప్పటిదాకా బయటికి పెద్దగా కనిపించదు కానీ జపాన్ యానిమే సిరీస్ లకు ప్రతి దేశంలో కోట్లాది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆన్ లైన్ లో మిలియన్ల వ్యూస్ తో పైరసీ సైట్లు హోరెత్తిపోయిన దాఖలాలు కోకొల్లలు. అలాని ఇదేదో చిన్నపిల్లలు చూసే సరదా యానిమేషన్ లా ఉండదు. విపరీతమైన వయొలెన్స్, సూపర్ హీరో ఎలిమెంట్స్, డార్క్ వరల్డ్, భయపెట్టే ఫైట్లు, కిక్ ఇచ్చే ఎపిసోడ్లు ఇలా మాస్ యూత్ జనాలు ఊగిపోయే రేంజ్ లో ఎలివేషన్ స్టఫ్ ఉంటుంది. ఒక్కసారి అలవాటు చేసుకుంటే వీటిని వదలడం కష్టం. పది ఇరవై ఎపిసోడ్లు ఉన్నా ఏకధాటిగా చూసే కుర్రకారు ఫ్యానిజం డెమోన్ స్లేయర్ కు ఉండటం అతిశయోక్తి కాదు.

అదే రోజు తేజ సజ్జ మిరాయ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కిష్కిందపురిలు ఉన్నా సరే నైజామ్ బుకింగ్స్ జపాన్ సినిమాకు ఇంత బాగా ఉండటం ఆశ్చర్యం. ఫైనల్ రన్ లో ఈజీగా పాతిక కోట్లు దాటేస్తుందని ఒక అంచనా. ఐమాక్స్ స్క్రీన్లలో తెల్లవారుఝామున 5 గంటలకే షోలు వేయబోతున్నారు. 2019 లో టీవీ సిరీస్ గా మొదలైన ఈ ఫ్రాంచైజ్ నుంచి వరల్డ్ వైడ్ ఇంత పెద్ద ఎత్తున రిలీజవుతున్న సినిమా ఇదే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ జపాన్ దేశంలో జూలై 18 విడుదలైపోయి బ్లాక్ బస్టర్ సాధించింది. 295 మిలియన్లకు పైగా వసూలు చేసింది. మూడు నెలల తర్వాత అందరి దగ్గరకు వస్తోంది.