కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘లిటిల్’ జంట

పండ్లు కాయలవ్వడం, కాయలు పండ్లవ్వడం అంటే ఇదేనేమో. స్టార్ క్యాస్టింగ్, పెద్ద బడ్జెట్ పెట్టుకున్న ఘాటీ ఎదురీదుతుండగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ట్రేడ్ సమాచారం మేరకు మొదటి రోజు సుమారు రెండున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిన్న సినిమా రెండో రోజు అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేయడం ఖాయమే. ఇక ఆదివారం ఎవరి ఊహలకు అందని రీతిలో నెంబర్లు నమోదు కాబోతున్నాయి. చాలా సెంటర్లలో షోలు, టికెట్ల డిమాండ్ పెరిగిపోయి ఇతర రిలీజులకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లను పక్కనేపట్టి మరీ ఎక్స్ ట్రా స్క్రీన్లు జోడిస్తున్నారు.

సోషల్ మీడియా సెలబ్రిటీ మౌళిని హీరోగా పెట్టి తీసిన ఈ చిన్న చిత్రం ఇంత సెన్సేషన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నిబ్బా నిబ్బిల లవ్ స్టోరీ అని కామెంట్లు వినిపిస్తున్నా ఎంటర్ టైన్మెంట్ కోసం మొహాలు వాచిపోయిన ఆడియన్స్ కుటుంబాలతో సహా లిటిల్ హార్ట్స్ కు వస్తున్నారు. ఎలాంటి అసభ్యత లేకుండా దర్శకుడు సాయి మార్తాండ్ తీసిన విధానం ఆకట్టుకుంటోంది. ఓవర్సీస్ విషయానికి వస్తే లక్షా పద్నాలుగు వేల డాలర్లు వసూలు చేయడం నిజంగా షాకే. ఎందుకంటే ఓ మోస్తరు మీడియం రేంజ్ హీరోలకు వీకెండ్ కూడా వసూలు చేయలేని నెంబర్ ఇది. అందుకే ఆశ్చర్యం కలిగిస్తోంది.

సండే మొత్తం లిటిల్ హార్ట్స్ కంట్రోల్ లోనే ఉండబోతోంది. బుక్ మై షోకు గంటకు 7 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఘాటీ కేవలం పదిహేడు వందలకు పరిమితం కాగా మదరాసి తెలుగు వెర్షన్ ఇంచుమించు ఇదే స్థితిలో ఉంది కానీ కొంచెం బెటర్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ క్రేజీ మూవీ బాఘీ 4 ఎనిమిదిన్నర వేల దగ్గర ఉండటం గమనార్హం. అంటే దేశమంతా రిలీజైన ఒక పెద్ద హిందీ సినిమాకు, తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన లిటిల్ హార్ట్స్ బుకింగ్స్ కు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం వెయ్యి టికెట్లు మాత్రమే. సోమవారం నుంచి కూడా ఇదే జోరు కొనసాగిస్తే లాభాలకు హద్దులు పెట్టడం కష్టమే.