విడుదలకు ముందు మదరాసి ప్రమోషన్లలో దర్శకుడు మురుగదాస్ అన్న మాటలు మరోసారి బయటికి వస్తున్నాయి. తమిళ డైరెక్టర్లు విజ్ఞానాన్ని బోధించడానికి సినిమాలు తీస్తారని, అందుకే వెయ్యి కోట్లు రావడం లేదనే కామెంట్స్ ని ఫ్యాన్స్ మళ్ళీ తవ్వుతున్నారు. కారణం మదరాసి. నిన్న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు తమిళంలో ఓ మోస్తరు స్పందన దక్కగా తెలుగులో ఎదురీదుతోంది. ఘాటీ కన్నా కాస్త మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ లిటిల్ హార్ట్స్ కన్నా వెనుకబడి ఉన్న వైనం ఫైనల్ స్టేటస్ ఏంటో చెప్పకనే చెబుతోంది. కమర్షియల్ స్థాయి ఏంటనేది రెండు మూడు రోజులయ్యాక తేలుతుంది కాబట్టి వెయిట్ చేయాలి.
ఇక అసలు విషయానికి వస్తే మదరాసిలో ఏం చదువు చెప్పారని, ఏం జ్ఞానం ప్రసాదించారని నెటిజెన్లు నిలదీస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గజనిలో సూర్య ఫార్ములాని ఇంకో రకంగా మార్చుకుని శివ కార్తికేయన్ పాత్రకు జబ్బు పెట్టిన మురుగదాస్ మిగిలిన ట్రీట్ మెంట్ అంతా రొటీన్ గానే తీసుకెళ్లారు. ముఖ్యంగా సెకండాఫ్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. విపరీతంగా సాగదీసి సహనానికి పరీక్ష పెట్టారని, ఫైట్లతో చిరాకు పుట్టించారని, పాటలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదని ఇలా రకరకాలుగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది. హీరో శివ కార్తికేయన్ నటన తప్ప ఫీడ్ బ్యాక్ అంతా ఇలాగే ఉంది.
ఇప్పుడు దీనికి మురుగదాస్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమాగా మదరాసి మీద ఇతర భాషల్లో క్రేజ్ లేకపోవడానికి కారణం దర్శకుడి బ్రాండే అనేది కాదనలేని వాస్తవం.. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే సీన్ వేరేలా ఉండేది కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడీ డిస్కషన్ వచ్చింది. మదరాసి ఫైనల్ స్టేటస్ ని బట్టి మురుగదాస్ నెక్స్ట్ ఎవరితో చేస్తారనేది ఆధారపడి ఉంది. సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ అంత అన్యాయంగా మదరాసి ఫ్లాప్ అవ్వకపోవచ్చు కానీ అమరన్ రేంజులో సగం కూడా అందుకోలేదన్నది బహిరంగ రహస్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates