ఒకప్పుడు తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. పెద్ద డైరెక్టర్లు.. స్టార్ హీరోయిన్లు.. భారీ బడ్జెట్లతో తన సినిమాల రేంజే వేరుగా ఉండేది. కానీ మధ్యలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ వల్ల కొన్నేళ్ల పాటు ఇక్కడ కనిపించకుండా పోయాడు. ఆ సినిమా తనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. తిరిగి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు శ్రీనివాస్ మొదలుపెట్టిన సినిమా.. టైసన్ నాయుడు.
ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. కానీ రిలీజ్ గురించి మాత్రం న్యూస్ లేదు. ఏడాదిగా ఈ సినిమా అసలు వార్తల్లోనే లేదు. దీని తర్వాత శ్రీనివాస్ మొదలుపెట్టిన భైరవం రిలీజైపోయింది. ‘కిష్కింధపురి’ కూడా రిలీజ్‌కు రెడీ అయింది. శ్రీనివాస్ ఇంకో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. కానీ ‘టైసన్ నాయుడు’ సంగతే ఎటూ తేలడం లేదు. దాని ఊసే వినిపించడం లేదు.
ఐతే ఈ నెల 12న ‘కిష్కింధపురి’ రిలీజ్ కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ‘టైసన్ నాయుడు’ గురించి స్పందించాడు. ఆ సినిమా ఎప్పుడో పూర్తయిన మాట వాస్తవమే అన్నాడు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయిందని చెప్పాడు. ఈ చిత్రాన్ని డిసెంబరులో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు అతను వెల్లడించాడు. ‘టైసన్ నాయుడు’ దర్శక నిర్మాతలు పేరున్న వాళ్లే.
అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలతో సత్తా చాటిన సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని రూపొందించాడు. 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ప్రొడ్యూస్ చేశారు. తన శైలిని పక్కన పెట్టి శ్రీనివాస్ స్టయిల్లో పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాడు సాగర్ చంద్ర. మొదలైనపుడు ఈ సినిమాకు బజ్ బాగానే ఉంది. కానీ మరీ ఆలస్యం కావడంతో జనాలు ఈ సినిమా గురించి మరిచిపోయారు. శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’ చేసిన నభా నటేష్ ఇందులో కథానాయికగా నటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates