టాలీవుడ్లో ఒక సినిమా కన్ఫమ్ చేయడానికి, ఆ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి చాలా టైం తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. స్టార్ ఇమేజ్ సంపాదించాక అతను ఆషామాషీగా ఏ కథనూ ఓకే చేయట్లేదు. మేకింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. తనతో జట్టు కట్టే దర్శకులూ అందుకు తగ్గవాళ్లే ఉంటారు. అందుకే తన సినిమాల రిలీజ్‌కు బాగా టైం పడుతుంటుంది. సినిమాకు సినిమాకు గ్యాప్ పెరిగిపోతుంటుంది.
‘పుష్ప’ రెండు భాగాల కోసం అతను ఐదేళ్లకు పైగా సమయం వెచ్చించాడు. ‘పుష్ప-2’ రిలీజ్ అయ్యాక అయినా స్పీడు పెంచుతాడనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ముందు అనుకున్న త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి అట్లీతో జట్టు కట్టిన బన్నీ.. ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టించాడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉంది కాబట్టి వచ్చే ఏడాదే ఈ సినిమా రిలీజైపోతుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ అది జరగదన్నది యూనిట్ వర్గాల సమాచారం.
బన్నీ-అట్లీ మూవీ చిత్రీకరణకు ఎంత టైం పడుతుందో.. అంతకుమించి పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం తీసుకోబోతున్నారు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ చిత్రమిది. హాలీవుడ్ టెక్నాలజీ వాడుతున్నారు. పేరున్న వీఎఫెక్స్ స్టూడియోలు పని చేస్తున్నారు. కాబట్టి సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుత అంచనా ప్రకారం 2027 ఆగస్టు రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.
కానీ ఇలాంటి భారీ చిత్రాలకు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఎలాగూ కొంచెం ఆలస్యం అవడం కామనే కాబట్టి… సినిమా మరింత ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన చూస్తే ‘పుష్ప-2’ వచ్చిన మూడేళ్లకు కానీ బన్నీ తర్వాతి సినిమా రిలీజ్ కాదన్నమాట. ఐతే ఈసారి బన్నీ చేస్తున్న సినిమా తన ఇమేజ్‌ను ఇంకా పెంచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందన్న అంచనాలుండడంతో లేటైనా సరే.. బాక్సాఫీస్ మోత మోగిపోతుందని అభిమానులు ఆశతో ఎదురు చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates